గల్ఫ్ లోని మనోళ్లకు అండగా ఉంటాం: కేరళం పర్యటనలో ప్రధాని మోదీ

గల్ఫ్ లోని మనోళ్లకు అండగా ఉంటాం: కేరళం పర్యటనలో ప్రధాని మోదీ
  • దేశ ప్రగతిపై రాహుల్ గాంధీకి అవగాహన లేదని ఎద్దేవా 

కొచ్చి: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. విదేశాల్లో చిక్కుకున్న తన పౌరులను భారత్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని..ఆయా దేశాల్లోని భారతీయులకు వీలైనంత సాయం అందించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  మోదీ బుధవారం కేరళంలో పర్యటించారు.

 కొచ్చిలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ బహిరంగ సభ ద్వారా ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.." అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. యుద్ధంపై కాంగ్రెస్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. భారత యువత డ్రోన్ తయారీ రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి కాంగ్రెస్ 'యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశించి )'కు అవగాహన లేదు. 

కేరళంలోని యువత కూడా డ్రోన్ స్టార్టప్‌‌లను నడుపుతున్నారని ఆయనకు తెలియదు. సంకుచిత ఆలోచనలు ఉన్నవారు దేశ పురోగతిని చూడలేరు" అని ఎద్దేవా చేశారు.కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అధికారంలోకి రావడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని మోదీ ఆరోపించారు. ఐదేండ్లకోసారి అధికారం మారుతుందన్న ధీమాతో  ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని తెలిపారు. ఇదే కేరళంలో అవినీతికి కారణమైందని విమర్శించారు. కేరళంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

 అనంతరం ప్రధాని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలోనూ మాట్లాడారు. యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన ఎల్‌‌పీజీ సంక్షోభంపై ప్రజలు ఆందోళన చెందవద్దని..కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొన్న స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితిని విజయవంతంగా అధిగమిస్తామి పేర్కొన్నారు.