కాళ్లు మొక్కుతం సారూ..  ట్రిపుల్​ఆర్ కు ​భూములియ్యం

కాళ్లు మొక్కుతం సారూ..  ట్రిపుల్​ఆర్ కు ​భూములియ్యం

మెదక్ (శివ్వంపేట), వెలుగు :  ‘‘సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. మా భూములు సర్వే చేయకండి.. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ దాని మీదనే బతుకుతున్నం..”అని శుక్రవారం  మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్​లో  ఓ మహిళా రైతు ట్రిపుల్​ఆర్​ రోడ్డు సర్వే కోసం వచ్చిన ఆర్డీవో శ్రీనివాసులు కాళ్లు మొక్కింది.  గ్రామానికి ట్రిపుల్​ఆర్  రోడ్డు కోసం  భూములు  సర్వే చేయడానికి నర్సాపూర్​ ఆర్డీవో శ్రీనివాస్​, ఆర్ఐలు, సర్వేయర్లు వచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న రైతులు వారిని అడ్డుకొని తమ భూములు సర్వే చేయవద్దని కోరారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇచ్చేది లేదని.. ఆఫీసర్లు ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని ఆఫీసర్లపై  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘పది, ఇరవై గుంటలు, ఎకరా భూమి ఉన్న చిన్న రైతులం.. భూమి పోతే ఎలా బతకాలి.. పిల్లల బతుకులెట్లా.. భూములు పోతే అందరం కలిసి పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంటాం”అని ఆవేదన వ్యక్తం చేశారు.  కాళేశ్వరం కాల్వ, కొండ పోచమ్మ కాల్వ, హై టైన్షన్​ కరెంట్​ వైర్​ లైన్లు అన్నీ తమ గ్రామం నుంచే పోతున్నాయని, ఉన్న భూములన్నీ పోతే రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వస్తుందని వాపోయారు.

అధికార పార్టీ నాయకుల భూముల్లో నుంచి వెళ్లకుండా అలైన్​మెంట్​ మార్చి పేద రైతుల భూములను ఆక్రమించి రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్​ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వేలు చేస్తే ఊరుకునేదిలేదని,  భూమికి భూమి ఇవ్వాలని,  లేనట్లయితే ఎకరాకు కోటి రూపాయలు ఇస్తేనే భూములిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆర్డీవో శ్రీనివాస్​ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.