యూరియా కోసం పడిగాపులు

యూరియా కోసం పడిగాపులు

భిక్కనూరు/లింగంపేట, వెలుగు: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్​అయ్యారని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రైతులు ఆరోపించారు. గురువారం జంగంపల్లి గ్రామంలోని నేషనల్​హైవే44పై బైఠాయించి యూరియా కోసం ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా సప్లై చేయాలని డిమాండ్​చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఏఎస్పీ అన్యోన్య అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ సిద్దరాములు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి యూరియా సప్లై ఆగిందని, సమస్యను రైతులు అర్థం చేసుకోవాలన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికీ సరిపడా యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు రోడ్డెక్కే వరకు మీరేం చేస్తున్నారని స్థానిక పోలీసులపై ఏఎస్పీ అన్యోన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లింగంపేటలో పడిగాపులు
లింగంపేట మండలంలో సరిపడా యూరియా సప్లై చేయకపోవడంతో 10 రోజులుగా ఉదయాన్నే రైతులు సహకార సంఘాల ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గురువారం లింగంపేట సొసైటీకి రెండు లారీల యూరియా రావడంతో రైతులు విండో ఆఫీస్​ఎదుట గుమిగూడారు. విండో చైర్మన్ దేవేందర్​రెడ్డి పోలీసుల సహకారంతో రైతులకు యూరియాను సరఫరా చేశారు.