ఢిల్లీలో ఆరో రోజూ రైతుల నిరసనలు

ఢిల్లీలో ఆరో రోజూ రైతుల నిరసనలు

చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)కి చట్టబద్ధత, ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు, రైతు కూలీలకు పెన్షన్, పంట రుణాల మాఫీ, ఇతర డిమాండ్లతో రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ పేరుతో చేపట్టిన నిరసనలు ఆరో రోజున ఆదివారం కూడా కొనసాగాయి. దీంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీ బార్డర్లలో ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఎక్కడికక్కడ ఢిల్లీ వైపు వెళ్లే రోడ్లపైకి చేరుకోగా.. వారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు, కంచెలతో అడ్డుకున్నారు. పంజాబ్, హర్యానా బార్డర్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లైన శంభు, ఖనౌరీ బార్డర్ల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

ఆరు రోజులుగా రైతులు ట్రాక్టర్లతో ఈ ఎంట్రీ పాయింట్ల వద్దే వేచి ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోపే ఎంఎస్ పీకి చట్టబద్ధతకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ రైతులు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, యూపీ, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 200 సంఘాల రైతులు ఈ నెల 13 నుంచి ఢిల్లీ చలో మార్చ్​లో  పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ నెల 8, 12, 15వ తేదీల్లో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు మూడు విడతలుగా చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఆదివారం రాత్రి నాలుగో విడత చర్చలు జరిగాయి.