రుణాలివ్వని బ్యాంకులు..అప్పులతో అన్నదాతల ఆత్మహత్య

రుణాలివ్వని బ్యాంకులు..అప్పులతో అన్నదాతల ఆత్మహత్య

అన్నితట్టుకొని భూమిని నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతకు కష్టాలు తప్పడంలేదు. సాగు మొదలు అతివృష్టి, లేదంటే అనావృష్టి….  అలానే ముందుకు సాగుతుంటే… పెట్టుబడులకు  బ్యాంకులు సాయం చేయని దుస్థితి ఉంది.  సకాలంలో అప్పులు ఇవ్వకపోవడంతో…ఎక్కువ మిత్తితో  రైతులు బయట అప్పులు తీసుకుంటున్నారు. అప్పులతో పాటు వడ్డీలు పెరగడంతో  ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నదాతలు.

2014 నుంచి ఈ ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో చిన్న, కౌలు రైతులే ఎక్కువ ఉన్నట్లు అధికారికంగా తెలిపారు. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘాలు, రైతు స్వరాజ్య వేదిక సంస్థలు అధ్యయనం చేసి చెబుతుండగా.. అధికారుల సమాచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కూడా ఎఫ్ ఐఆర్  నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఆత్మహత్యగా ధ్రువీకరించే ముగ్గురు సభ్యుల బృందం తహసీల్దార్ , SI, మండల వ్యవసాయ అధికారి మాత్రం అంత తేలిగ్గా ఒప్పుకోవడం లేదు. 400 మంది రైతుల్లో 162 మందివి సూసైడ్ గా ధ్రువీకరించగా… ఇప్పటి వరకు 80 మందికి ఒక్కొక్కరికి 6 లక్షల చొప్పున ఇచ్చారు. మరో 82 మందికి నిధులపై ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు నగదు అందలేదు. బ్యాంకుల వల్లే అన్నదాతకు ఇబ్బందులొస్తున్నాయని రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా… స్పందించడం లేదని మండిపడుతున్నారు రైతు సంఘాల నేతలు.

సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకులు… జిల్లాల్లో రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వ మార్గదర్శకాలు రాకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వడం లేదు. 31 మండలాల నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ లో 1,907 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్  మొదలై 3 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చింది వెయ్యి కోట్లకంటే తక్కువే. అంటే 50 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయి.

అన్నదాతలు సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాల కోసం ఎక్కువ మిత్తికి అప్పులు చేస్తున్నారు. మరోవైపు పంట పెట్టుబడి పథకం కింద ప్రభుత్వం పంటకు ఎకరానికి 5 వేలు ఇస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం 6 వేలు ఇస్తోంది. అయినా రైతు సాగుకు ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. రాష్ట్ర సర్కారు కౌలు రైతుకు ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు 60 వేల మంది వరకు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో వీరికి గుర్తింపు కార్డులివ్వగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు అందట్లేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో కరవు వస్తుండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల్లో 35 నుంచి 48 మధ్య వయసు ఉన్న వారేనని నివేదిక చెబుతోంది. ఈ కష్టకాలంలో రైతు కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగాలు బాసటగా నిలవాలంటున్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందించడంతో పాటు ఆత్మహత్యల నివారణకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.