
- భూములు గుంజుకొని రియల్ దందా చేస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: రైతుల భూములు గుంజుకొని తెలంగాణ ప్రభుత్వం దళారి పాత్ర పోషిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. భూ సేకరణ పేరుతో భూ దందాకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రైతుల బాధలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతు ఉసురు ఊరికే పోదని, వారి ఉద్యమమే కేసీఆర్ పతనానికి నాంది అని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి రైతుల ఆందోళనకు తమ సపోర్టు ఉంటుందన్నారు. రాములుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్య అని మండిపడ్డారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే కలెక్టర్ తీసుకోకపోవడం దారుణమన్నారు. ఆయనపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రైతు చనిపోతే మంత్రి కేటీఆర్... ‘‘ఎవరో చనిపోయారట”అని నిర్లక్ష్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే.. రైతు ఆదాయంలో 20వ స్థానంలో ఉందని తెలిపారు.
గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం సర్పంచ్ల జేబుల నుంచి కొట్టేసిందన్నారు. ఈ సర్కార్ కంటే.. జేబుదొంగలే నయం అని ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా మాస్టర్‌ప్లాన్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతున్నదన్నారు. ‘‘కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో’’ నినాదంతో సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న మోసాలపై త్వరలో హైదరాబాద్ లో మేధావులు, కళాకారులు, కవులతో సెమినార్ నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే గూటి పక్షులు అని విమర్శించారు. తర్వాత పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల మీటింగ్‌కు లక్ష్మణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత ప్రధాని మోడీదే అని అన్నారు.