పవర్ లైన్లో భూములు కోల్పోతున్నం
సరైన నష్టపరిహారం చెల్లించండి
సీఎస్‌ను కోరిన రైతులు
హైదరాబాద్, వెలుగు: బీదర్–మహేశ్వరం మధ్యలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న 165 కిలోమీటర్ల 765 కేవీ లైన్లో 3 వేల ఎకరాలు కోల్పోనున్న నేపథ్యంలో సరైన నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఈ లైన్ రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా వెళుతుందన్నారు.
ఈ మేరకు సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమారిని పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పులువురు రైతులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇందులో భూములు కోల్పోతున్న రైతుల్లో 90 శాతం మందికి 2 ఎకరాల్లోపే ఉన్నాయన్నారు. ఒక్కో టవర్‌కు 12 గుంటలు, ఎలక్ట్రిక్ లైన్‌కు 12 గంటల భూమి పోతుం దని సీఎస్ కు తెలిపారు. ఇక్కడ ఎకరా భూమి రూ.3 కోట్ల విలువ ఉందని, ఇచ్చే పరిహారం మాత్రం లక్షల్లో ఉందన్నారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ వాల్యూను రైతులకు చెల్లించాలని సీఎస్ ను కోరారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామ న్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారని సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు.