సర్కారు పంట రూల్స్ తో రైతుకు తిప్పలే

సర్కారు పంట రూల్స్ తో రైతుకు తిప్పలే

హైదరాబాద్, వెలుగుకొత్త వ్యవసాయ పాలసీ రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇక నుంచి ఏయే పంటలు ఎంత మేరకు సాగు చేయాలన్నది ప్రభుత్వమే డిసైడ్​ చేయనుంది. కొత్త పద్ధతి పాటిస్తేనే పంటల ఉత్పత్తులకు బంపర్​ రేట్​వస్తుందని చెబుతున్న రాష్ట్ర సర్కార్​.. ఈ వానాకాలం నుంచి తాము చెప్పిన పంటనే వేయాలంటోంది. మరో పదిహేను ఇరవై రోజుల్లో సాగు మొదలవుతున్న ఈ టైంలో  పంటమార్పిడి అని ప్రభుత్వం చెప్పడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఏండ్లకేండ్లుగా రాష్ట్రంలోని రైతులు సంప్రదాయ సాగు పద్ధతులను పాటిస్తున్నారు. తమకున్న భూమి రకం, ఉన్న నీటి వనరుల అంచనాతోనే పంటలు పండిస్తున్నారు. ఇక నుంచి సర్కారు చెప్పిన పంటలే పండించాలనడంతో వాళ్లు ఆందోళన చెందుతున్నారు. పైగా వచ్చే సీజన్​ నుంచి ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనబోదని వరి పండించే రైతులను హెచ్చరించటం.. చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు సాయం కట్​ చేస్తామని షరతులు పెట్టడం గందరగోళానికి దారితీస్తున్నది.

వరి కంటే పత్తితోనే చిక్కులు

వరితో పోలిస్తే మార్కెట్​లో పత్తి రేట్ల హెచ్చుతగ్గులు ఎక్కువ. నిల్వ చేయడానికి గోదాములు లేకపోవటం, ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్​తో ముడిపడి ఉండటంతో ఏటా పత్తి రైతులు వ్యాపారుల చేతుల్లో చిత్తవుతున్నారు. సాధారణంగా వడ్లు అమ్మితే మద్దతు ధర రాకున్నా రూ. 100 నుంచి రూ. 2‌00  తేడాతో అమ్ముకుంటామనే ధీమా రైతుల్లో వ్యక్తమవుతుంది. కానీ పత్తి పంట ధరల తేడా ఒక్కో రోజు రూ. వేలల్లో పడిపోతుంది. నిరుడు మార్కెట్లో క్వింటాకు రూ. 6,000 ధర దాటిన పత్తి ధర కనిష్ఠంగా రూ.3300 వరకు పడిపోయింది. కేంద్రం ఆధ్వర్యంలోని సీసీఐ రంగంలోకి దిగి కొనుగోలు చేస్తే తప్ప మద్దతు ధర అందని పరిస్థితిని రైతులు చవిచూశారు.

అప్పట్లో పత్తి వద్దని చెప్పి..!

పత్తి పంటకు సరైన ధర లేదని నాలుగేండ్ల కిందట పత్తి సాగును తగ్గించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ భారీగా ప్రచారం చేసింది. 2016 ఏప్రిల్​లో పత్తి పంట వేసి నష్టపోవద్దని  సీఎం కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. అప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరిన సీఎం.. ఇప్పుడు తెలంగాణ పత్తికి  ఇంటర్నేషనల్​ మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని  ఎంకరేజ్​ చేయటం కొత్త చర్చకు తెరలేపింది. వరి సాగు తగ్గించి, పత్తి విస్తీర్ణం పెంచటం రైతులకు గుబులు పుట్టిస్తున్నది. వరికి బదులు వానాకాలంలో పత్తి, కంది సాగు చేయాలని, మక్కలు అసలే వేయొద్దనేది కొత్త పాలసీ.

కందికి ఓకే.. పత్తికి గ్యారంటీ ఎట్ల..?

వచ్చే సీజన్​లో ‘ఒక్క ధాన్యం గింజ కూడా కొనేది లేదు’ అని చెప్పటం.. కంది  పండిస్తే గంట లేట్​ లేకుండా కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం గమనార్హం. అదే పత్తి పండిస్తే  నేరుగా కొనుగోలు చేసే బాధ్యత, మద్ధతు ధర ఇచ్చే పూచీ కేంద్రంపై ఉంటుందని, పంట ఉత్పత్తుల కొనుగోళ్ల నుంచి తప్పుకునేందుకే  రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తెస్తున్నదని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా కంది పంటను రాష్ట్రంలోని రైతులు ప్రధాన పంటగా  భావించకుండా.. అంతర పంటగా సాగు చేస్తారు.  కరీంనగర్​, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని మక్క, పెసర పంటల్లో అంతరంగా  దీన్ని వేస్తున్నారు. తక్కువ నీళ్లున్న నిస్సార ఎర్ర భూముల్లో కంది పంట వేస్తారు. దీంతో పాటు స్వల్ప వ్యవధిలో వచ్చే పంట కావటంతో మక్క సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రభుత్వం ఏ పంట చెబితే ఆ పంట వేయాలని ఆంక్షలు విధించటం.. తమను కట్టడి చేసేనట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సన్నాలు సాధ్యమేనా..?

వరి సాగులోనూ సన్న రకం సాగు విస్తీర్ణం పెంచాలనేది కొత్త పాలసీ. అయితే గ్రౌండ్​లెవల్​లో విభిన్న పరిస్థితులున్నాయి. దొడ్డు రకం, సన్న రకం వడ్లకు మద్దతు ధరలో పెద్దగా తేడా లేదు. సన్నాలకు కింటాల్​కు రూ. 1835, దొడ్డు రకానికి రూ. 1815 ఉంది. దొడ్డు రకం వరి సాగు కంటే సన్నాలకు సాగు కాలం రెండు మూడు వారాలు ఎక్కువ. పెట్టుబడి ఖర్చూ ఎక్కువే. సన్నరకం వరికి తెగుళ్లు సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆశించినంత పంట దిగుబడికి గ్యారంటీ ఉండదు. దీంతో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకం వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. సన్న రకం వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసే విధానం లేదు. అందుకే రైతులు సన్న రకం వరి సాగుకు పెద్దగా ఇష్టం చూపడం లేదు.

విత్తనాల కొరత

కొత్త వ్యవసాయ పాలసీతో గతంలో ఉన్న సాధారణ సాగు విస్తీర్ణం మారిపోనున్నది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన విస్తీర్ణం ప్రకారం మార్కెట్​లో విత్తనాలు అందుబాటులో లేకపోవటం ప్రధాన  సమస్యగా మారనుంది. 70 లక్షల ఎకరాల పత్తి సాగు చేయాల్సి ఉంటే.. మార్కెట్​లో 40 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతున్నది. దీంతో నకిలీ విత్తనాలు మళ్లీ పోటెత్తే ప్రమాదముందని, ఒత్తిడి పెంచితే  రైతులు మోసపోతారని అగ్రికల్చరల్​ ఎక్స్​పర్ట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత కరెంట్ భారం తగ్గింపు కోసమా?

వరి పంట సాగు తగ్గితే ఉచిత కరెంట్​ భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.  ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. ఈ పంపు సెట్ల కింద వాడుకునే కరెంట్​కు చార్జీలను ప్రభుత్వం భరిస్తున్నది. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 5,000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తున్నది. వరి సాగు చేయడం వల్లనే ఎక్కువ కరెంట్​ వినియోగం అవుతోందని, దానికి బదులు పత్తి సాగు చేస్తే కరెంట్ వాడకం తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.

రైతు బంధుపై షరతులు

ఇంతకాలం రైతు బంధు పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఏ పంట సాగు చేసినా.. అసలు సాగు చేయని భూములకు, పట్టా ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు సాయం పంపిణీ చేస్తామని సీఎం పలుమార్లు ప్రకటించారు. కొత్త పాలసీ ప్రకారం రైతు బంధు సాయం అందుకోవాలంటే షరతులు వర్తిస్తాయి. ప్రభుత్వం చెప్పిన పంటను సాగు చేస్తున్నారా?  లేదా? అని స్థానిక వ్యవసాయాధికారి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ రైతులకు మాత్రమే రైతు బంధు జమవుతుంది. పంటలు సాగు చేయని భూములన్నీ ఈ లిస్టులో నుంచి తొలిగిస్తారు. ప్రభుత్వం చెప్పిన పంట వేశారా? లేదా? అని నిరూపించుకోవటం రైతులకు పరీక్షగా మారుతుంది.

వడ్లు కొనుడు ఇక ఉండదా?

వచ్చే సీజన్​ నుంచి వడ్ల కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకునే అవకాశాలున్నాయి. ఏటా దాదాపు 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నది. ఊళ్లల్లో ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించి.. రైతులకు చెక్కుల ద్వారా మద్దతు ధర అందిస్తున్నది.  ఉమ్మడి రాష్ట్రం నుంచి వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ప్రతి సీజన్​లో అమలవుతున్నది. కానీ.. వడ్లు కొనటం లేదని, డబ్బులు సకాలంలో ఇవ్వటం లేదని, ఆలస్యమవుతున్నదని చాలా చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో రెండు నెలల పాటు రెవెన్యూ, అగ్రికల్చర్, సివిల్​ సప్లై విభాగాలు వడ్ల కొనుగోళ్ల ప్రక్రియతో బిజీగా ఉంటున్నా ఆశించిన ఫలితం లేకుండా పోతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే వచ్చే సీజన్​నుంచి వడ్లు కొనేది లేదని రైతులను ముందుగానే కట్టడి చేయాలని నిర్ణయించింది.  అట్లనే వరి సాగు తగ్గితే ఉచిత కరెంట్​ భారం కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన.

రైతులనుబెదిరించడం సరికాదు

రైతుబంధు నుంచి ప్రభుత్వం క్రమంగా లబ్ధిదారులను తగ్గిస్తున్నది.  ప్రభుత్వం చాలా రోజులుగా క్రాప్ కాలనీల గురించి ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఇప్పటికీ విధివిధానాలు రూపొందించలేదు. ఇప్పడు కొత్త వ్యవసాయ పాలసీపై చర్చిస్తున్నది. దీని ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టలేదు. తాము చెప్పిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు సాయం చేస్తాం.. పంటలు కొంటామని బెదిరించడం అన్యాయం. రైతులు  ముఖ్యమంత్రి దగ్గర పని చేసే పాలేర్లు కాదు. రైతులను బెదిరించకుండా అవగాహన కల్పించి ముందుకు నడిపించాలి.

– కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

ప్రవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు అనుమతివ్వండి