ఆఫీసర్ల కాళ్లపై పడ్డ దళిత రైతులు

ఆఫీసర్ల కాళ్లపై పడ్డ దళిత రైతులు

మహాముత్తారం, వెలుగు: జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఐదెకరాల భూమి విషయంలో దళితులు, రెవెన్యూ అధికారుల మధ్య గురువారం లొల్లి నడిచింది. మినీ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా, రెవెన్యూ అధికారులు మహాముత్తారం శివారులోని ఓ సర్వే నంబర్​లో ఐదెకరాలను కేటాయించారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా అందులో సాగు చేస్తున్న దళిత రైతులు అవి తమ భూములని తిరగబడ్డారు. పత్రాలు చూపిస్తూ కాళ్లపై పడ్డారు. రైతులు చూపిస్తున్న పత్రాలకు సంబంధించిన భూమి వేరే సర్వే నంబర్​లో ఉందని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్ల నుంచి సాగు చేస్తుంటే ఇప్పుడొచ్చి వేరే చోటికి వెళ్లమంటే ఎలాగని ఫైర్​ అయ్యారు. పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. చివరికి సర్ది చెప్పడంతో శాంతించారు. 

సర్వే నంబర్‌‌ మార్చేసి..

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం యామన్​పల్లికి చెందిన కొండగొర్ల లస్మయ్యకు సర్వే నెంబర్ 192లో 3.32 ఎకరాలు, 195/2 సర్వే నెంబర్​లో 38 గుంటలు, బుచ్చయ్య పేరుపై 195/1 సర్వే నెంబర్​లో 5 ఎకరాలు, ప్రకాశ్​పేరుపై 197 సర్వే నెంబర్​లో 2.17 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ మహాముత్తారం శివారులో ఉండగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ఇందులో అనేక ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించగా, రెవెన్యూ అధికారులు 325 సర్వే నెంబర్​లోని ఐదెకరాలు కేటాయించారు. గురువారం దళితుల భూముల దగ్గరకు వచ్చి చదును చేయడం మొదలుపెట్టారు. 

తిరగబడ్డ దళిత రైతులు

తమ భూమిలో చదును చేస్తున్నారని తెలుసుకున్న దళిత రైతు కుటుంబాలు అధికారులను అడ్డుకున్నాయి. ఇది తమ సర్వే నెంబర్ అంటూ పత్రాలు చూపించారు. దీంతో ఆఫీసర్లు ఇది 325 సర్వే నెంబర్​అని మీ భూములు మరోచోట ఉన్నాయని చెప్పారు. అయితే ‘సుమారు 40 ఏండ్లుగా సాగు చేసుకుని బతుకుతుంటే ఇప్పుడొచ్చి ఇది మా సర్వే నెంబర్ ​కాదంటే ఎట్లా? మాదని చెబుతున్న సర్వే నంబర్​లో వేరే వాళ్లు కూడా ఏండ్ల నుంచి సాగు చేసుకుని బతుకుతున్నరు. ఇప్పుడు పోయి మా భూములు ఇయ్యండి అంటే వాళ్లెట్లా ఇస్తారు? ’అని ప్రశ్నించారు. తమ భూములను వదిలేయాలని అధికారుల కాళ్లపై పడ్డారు. వినకపోవడంతో ఆగ్రహంతో ఆ భూమిలో అప్పటికప్పుడు గుడిసెలు వేసుకుని వంట వండుకుని తిన్నారు. ఎస్సై జంగిలి రమేశ్​, డిప్యూటీ తహసీల్దార్​ సందీప్​ వచ్చి వారిని వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో భూములు లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్, పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. మహిళా పోలీసులు వచ్చి వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాలను లాక్కున్నారు. తర్వాత ఉన్నతాధికారులను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని మహాముత్తారం ఎస్ఐ రమేశ్ చెప్పడంతో వారు వెళ్లిపోయారు. 

తహసీల్దార్ ను అడ్డుకున్న గ్రామస్థులు

కాగ జ్ నగర్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానం కోసం స్థల పరిశీలనకు వెళ్లిన తహసీల్దార్ ను ప్రజలు అడ్డుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా చింతల మానేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 59లో అసైన్డ్ భూములను ప్రజలు సాగు చేసుకుంటున్నారు. తహసీల్దార్ మునావర్ షరీఫ్ గురువారం సిబ్బందితో కలిసి ఆ స్థలంలో హద్దులు గుర్తించేందుకు వెళ్లగా గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు. సాగు భూముల్లో క్రీడా మైదానం కడితే ఎలాగని ప్రశ్నించారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో తహసీల్దార్, సిబ్బంది వెనుదిరిగారు.