ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్ కు రైతులే డబ్బులు చెల్లిస్తున్నరు! : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ట్రాన్స్ ఫార్మర్ల  రిపేర్ కు రైతులే డబ్బులు చెల్లిస్తున్నరు! : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
  •     ఒక్కో  రైతు నుంచి 10 వేల నుంచి 15  వేల వరకు వసూలు చేస్తున్నరు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
  •     ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     క్షేత్ర స్థాయిలో మీరు చెప్పినట్టుగా లేదన్న మండలి చైర్మన్​ గుత్తా 

హైదరాబాద్, వెలుగు:  వ్యవసాయ విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్లపై సోమవారం శాసనమండలిలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రైతులకు తలెత్తుతున్న విద్యుత్​ సమస్యలపై వివరించారు. కాలిపోయిన ట్రాన్స్​ ఫార్మర్​ రిపేర్​ చేసి తిరిగి గద్దెపై ప్రతిష్టించడానికి రైతులే స్వయంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు తమ జేబులోని డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తున్నదని తెలిపారు. గతంలో అగ్రికల్చరల్ విద్యుత్​  కనెక్షన్​ కోసం రైతులు డీడీలు చెల్లిస్తే మూడు నుంచి ఐదు కరెంట్​స్తంభాలు ఫ్రీగా వచ్చేవని.. ఇప్పుడు ఒక్కటే ఇస్తున్నారని.. మిగతా స్తంభాలను రైతులే కొనుక్కుంటున్నారని చెప్పారు. 

ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. మీరు ఎప్పటివో పాత విషయాలు చెబుతున్నారన్నారు. కరెంట్​ సమస్యలపై 1912 టోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేస్తే ప్రభుత్వం తరఫున వెహికల్ లో​సిబ్బంది వచ్చి ఏ తరాహా సమస్యలనైనా త్వరితగతిన పరిష్కరిస్తున్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఈ వ్యవస్థ చాలా పటిష్టంగా అమలుచేస్తున్నామని వెల్లడించారు. 

అయితే, దీనికి ఎమ్మెల్సీ సత్యం అంగీకరించలేదు. తాను స్వయంగా రైతునని.. మాది మునుగోడు అని చెబుతూ మీరు క్షేత్రస్థాయిలోకి వస్తే నేనే తమకు కళ్లకు కట్టినటకటుగా చూపిస్తామన్నారు. దీనిపై మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలు క్షేత్రస్థాయిలో కొన్ని అమలు కావట్లేదని అన్నారు. ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని, రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

పీఎం కుసుమ్ స్కీమును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది!: భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వం పదేండ్ల క్రితం తెచ్చిన 'పీఎం కుసుమ్' పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.  రాష్ట్రంలో పీఎం కుసుమ్ స్కీం అమలు కాలేదని తెలిపారు.  సోమవారం శాసనమండలిలో పీఎం కుసుమ్​, సూర్యఘర్​ స్కీంలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.." రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తం. వ్యవసాయ రంగంతో పాటు గృహ అవసరాలకు గ్రీన్ ఎనర్జీని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నం. 

సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని స్వయంగా కలిసి ఈ పథకాన్ని రాష్ట్రానికి కేటాయించాలని రాత పూర్వకంగా కోరాం. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నందున రైతులు, గృహ వినియోగదారులను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో కొన్ని మార్చాలని విజ్ఞప్తి చేశాం. వ్యవసాయ రంగంలోనూ సోలార్ విప్లవం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం. మహిళా సంఘాలు  సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 

అయితే,వ్యవసాయం చేసుకునే రైతులకే పీఎం కుసుమ్ వర్తింపజేస్తామని..కౌలు రైతులకు వర్తింపజేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇది కొంత అడ్డంకిగా మారింది.   కేంద్రం నుంచి పీఎం కుసుమ్ కింద కనెక్షన్లు మంజూరు చేయాలని కూడా  కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశాం. ఇప్పటికే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుండటంతో వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  వారిని చైతన్య పరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది’’ అని డిప్యూటీ సీఎం భట్టి  పేర్కొన్నారు.