మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ రైతులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గురువారం సబ్‌స్టేషన్‌లో ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేశారు. రెండు నెలల క్రితం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల సుమారు 100 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని రైతులు ఎల్లంకి రాజేష్, చిలకపాటి బలరాం, బత్తుల శోభన్ తెలిపారు.
ఈ విషయాన్ని పలుమార్లు ఏఈ కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. వినతిపత్రం ఇవ్వడానికి సబ్‌స్టేషన్‌కు వెళ్లగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చామన్నారు. కరెంట్ స్తంభాలు లేక మోటార్లుపని చేయడం లేదని, నారు పోయడం ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
