
హనుమకొండ సిటీ, వెలుగు: ల్యాండ్ పూలింగ్ జీవో 80ను ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) చైర్మన్ దేశినేని హనుమంతరావు, కన్వీనర్లు బుద్దె పెద్దన్న, సోల్తి కిరణ్, మునిగాల యాకుబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ లో పెరుమాండ్ల గూడెం థర్డ్ డిగ్రీ బాధితులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ జీవోను శాశ్వతంగా రద్దు చేయకుండా.. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, మభ్య పెట్టేందుకు ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇస్తోందన్నారు. 22 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లో కుడాకు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై దిగిరాకపోతే మొదటి నిరసనగా నగరంలోని అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు ఆపేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే రైతులంతా భిక్షాటన చేసి ఇస్తామని అన్నారు. గ్రామాల్లో ఎమ్మెల్యే ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఇప్పుడుందని, భవిష్యత్తులో గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పెరుమాండ్లగూడెం రైతులకు అయిన గాయాలను ఫోటో కాపీల ద్వారా ప్రెస్ మీట్ లో చూపించారు. వచ్చే గురువారం నాటికి ప్రభుత్వం జీవో 80 రద్దు చేయకపోతే శుక్రవారం రైతు జేఏసీ ఆఖరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ వందల ఎకరాల భూములు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.