వ్యాపారులు చెప్పిందే రేటు! పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

వ్యాపారులు చెప్పిందే రేటు! పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

మొదలుకాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు

తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి

ఖమ్మం/వరంగల్​/ఆదిలాబాద్​, వెలుగు: పత్తి రైతులకు మద్దతు కరువైంది. వర్షాలతో ఓవైపు పత్తి పంట దెబ్బ తినగా.. మరోవైపు చేతికందిన పంటకు సైతం మద్దతు ధర దక్కడం లేదు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 60.33 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ. 5,825, 12 శాతం తేమ ఉంటే రూ. 5,582  మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇందులో సగం ధరకే దళారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రేటు విషయంలో రైతులు గొడవకు దిగితే అసలు కొనుగోలు చేయబోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పత్తి కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 309 కొనుగోలు కేంద్రాలను కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. దసరా పండుగ నాడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్​జిల్లాల్లో ఇప్పటికే పత్తి పంట చేతికి రావడం, వానల కారణంగా పత్తి తడిసిపోయి ఉండడంతో రైతులు మార్కెట్ కు తీసుకువస్తున్నారు. తడిసిన పత్తిని నిల్వ ఉంచుకునే అవకాశం లేకపోవడం, మరింత నల్లగా మారి పూర్తిగా నష్టపోతామనే ఆందోళనలో రైతులు ఉండగా, వ్యాపారులు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. అతి తక్కువ ధరకు పత్తి కొంటున్నారు.

గరిష్ఠ ధర 5 వేలు దాటట్లే..

వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మంగళవారం దాదాపు 27,500 బస్తాల కొత్త పత్తిని రైతులు తీసుకొచ్చారు. గరిష్ఠ ధర 4,765 పలకగా కనిష్ఠంగా 3,000 ధర పడింది. బుధవారం 20 వేల బస్తాలు రాగా గరిష్ఠంగా 4,750, కనిష్ఠంగా 3,000 పలికింది.  సీసీఐ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మాయిశ్చర్ ను అనుభవజ్ఞులైన వ్యాపారులు అంచనా వేసి రైతులకు ధర కట్టిస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో తేమ శాతం 25 నుంచి 35 వరకు ఉంటున్నట్లు వ్యాపారులు అంచనా వేసి చెబుతున్నారు. ఈ మేరకు సగటున 3,500 నుంచి 4,000 వరకు రైతులకు చెల్లిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం రైతులు మొత్తం 5,636 బస్తాల పత్తి తీసుకువచ్చారు. వీటికి గరిష్ఠ ధర రూ.4,800 కాగా, కనీస ధర రూ.2,100 పలికింది. ఎక్కువ మంది రైతుల నుంచి క్వింటా రూ.3 వేలలోపే కొనుగోలు చేశారు. పత్తి క్వాలిటీ లేదని, నల్లగా రంగు మారిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని.. ఇలా రకరకాల కారణాలతో రేటు తగ్గించారు. ఇక బస్తాకు 3 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. అసలే తక్కువ రేటు పడుతుండగా, తరుగు పేరుతో రైతులు మరింత నష్టపోతున్నారు. అమ్ముకునేందుకు మరుసటి రోజు దాకా ఆగలేని రైతులు వచ్చిన రేటుకే పంటను అమ్ముకుంటున్నారు.

కూలీల ఖర్చు కూడా వస్తలేదు

వర్షాల వల్ల పత్తి తడిచి నష్టపోయాం. ఉన్న పత్తిని అయినా అమ్ముకోవాలని కూలీలతో తీయించి మార్కెట్ కు తీసుకుని వస్తే తగిన రేటు ఇవ్వడం లేదు. జెండా పాట రేటు ఒక రైతు తెచ్చిన వాటికి ఇచ్చి.. మిగిలిన పత్తి మాత్రం చాలా తక్కువ రేటుకు కొంటున్నరు. ప్రశ్నిస్తే నీకు ఇష్టం అయితే అమ్ము.. లేకపోతే పో అని బెదిరిస్తున్నరు. బస్తా తూకానికి 3 కేజీలు తరుగు తీస్తున్నరు. సీసీఐ కేంద్రాలు తెరవకపోవడంతో రైతులను కొనుగోలుదారులు ఇబ్బందులు పెడుతున్నరు.

– మన్నెం వెంకటేశ్వర్లు, మద్దులపల్లి, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా

తక్కువ రేటుకు అడుగుతున్నరు

వర్షాల వల్ల ముందు వచ్చిన పత్తి తడిచింది. పత్తిలోని గింజలు కూడా మొలకెత్తాయి. ఆ పత్తి అంతా పాడైందని దాన్ని పక్కన పెట్టిన. ఇప్పుడు వస్తున్న పత్తి కరాబు కాకుండా కూలీలతో తీయించి మార్కెట్ కు తీసుకువచ్చా. దానిలో తేమ ఉందని, నల్లగా ఉందని అంటూ చాలా తక్కువ రేటుకు అడుగుతున్నరు. క్వింటా రూ.2,800 చొప్పున కొన్నరు. కాంటా వేసే సమయంలో కిరికిరి పెట్టి రూ.2,500 చొప్పున అయితేనే తీసుకుంటామని రేట్లను తగ్గిస్తున్నరు. దిక్కుతోచని స్థితిలో పంటను అమ్ముకున్నా.

– గుగులోతు కృష్ణ, మల్లెపల్లి, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా

For More News..

డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు

హైదరాబాద్​‌లో చెరువుల  పర్యవేక్షణకు 15 టీమ్‌లు

టెట్ ఒక్కసారి రాస్తే చాలు.. లైఫ్​టైమ్ వ్యాలిడిటీ