రైతన్నకు కాంటా తంటా..!

రైతన్నకు కాంటా తంటా..!

పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
రాశుల వద్ద అన్నదాతల పడిగాపులు
అకాల వర్షాలతో ఆందోళన

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ఆరుగాలం శ్రమించే రైతన్నకు అడుగడుగా కష్టాలు తప్పడం లేదు. పంట నాటు వేసిన నాటి నుంచి నేటి వరకూ తిప్పలు పడుతూనే ఉన్నాడు. మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి నూర్పిల్లు పూర్తి చేసి వారం, పదిరోజులు అవుతోంది. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. మరికొన్ని ప్రాంతాల్లో కేంద్రాలు తెరిచినా గన్నీబ్యాగుల కొరతతో కొనుగోళ్ల‌లో జాప్యం జరుగుతోంది. మరో వైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించక అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లను జల్ది తూకం వేసి తరలించాని కోరుతున్నారు.

మెదక్‌‌‌‌లో 193 కేంద్రాలు..

మెదక్ జిల్లా లో 75 వేల ఎకరాల్లో వరి సాగైంది. 1.97 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పీఏసీ ఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో 285 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించారు. ముందుగా 181 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్నారు. లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎక్కడి వడ్లు అక్కడే కొనుగోలు చేసేలా అదనంగా మరో 104 కేంద్రాలు తెరవాలని నిరయించారు. ఇందులో ఇప్పటి వరకు జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 10,319 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 8,676 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారు.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో వరి పంట 22,800 ఎకరాల్లో వరి సాగు చేశారు. 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 92 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించారు. ఇందులో 52 పీఏ సీఎస్వి కాగా, 40 ఐకేపీ కేంద్రాలు. జిల్లాలో సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు బోర్ల కిందనే వరి సాగు చేశారని, నాట్లు ఆలస్యంగా వేసినందున పంట దిగుబడులు ఆలస్యంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణ‌యించినట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

పైసలు పడుతలేవు…

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో పైసలు జమ కావాల్సి ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇంకా రైతుల ఖాతాల్లో పైసలు జమ కావడం లేదు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.18.94 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం బకాయిఉన్నాయి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 10,319 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 4,439 మెట్రిక్ టన్నులకు సంబంధించి మాత్రమే ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు రూ.30.17
కోట్లవిలువైన ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం బకాయి ఉన్నాయి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 16,441 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 8,332 మెట్రిక్ టన్నులకు సంబంధించి మాత్రమే ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు.