
- పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అన్నదాతల ఆగం
- బీళ్లుగా 2 వేల ఎకరాలు ..ఎవుసం బంజేసి ఇండస్ట్రీల్లో పని చేస్తున్నరు
- సంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి
సంగారెడ్డి, వెలుగు : జిల్లాలోని పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల ఇండస్ట్రియల్ ఏరియా లో ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ రైతుల పొట్ట కొట్టింది. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న బంగారం లాంటి భూములు సాగుకు పనికిరాకుండా పోయాయి. దీంతో అన్నదాతలంతా ఎవుసం బంజేసి అవే ఫ్యాక్టరీల్లో కూలీలుగా చేరుతున్నారు. ఈ ఏరియాలో దాదాపు 250 ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంతో సుమారు రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. నష్టపరిహారం ఇవ్వాల్సిన ఫ్యాక్టరీల ఓనర్స్ పట్టించుకుంటలేరు.
విషం చిమ్మిన పరిశ్రమలు
ఈ ఏరియాలో వందల సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉండడం, వేస్టేజీని వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లతో కలిపి సమీప చెరువుల్లోకి వదులుతుండడంతో భూములు పనికి రాకుండా పోయాయి. ఫార్మా, బల్క్ డ్రగ్, కాటన్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను బయటకు పంపిస్తే భూగర్భ జలాలు పాడైపోతాయి. ఆ వాటర్‌తో వ్యవసాయం చేస్తే పంటలు పండవు. కానీ ఇక్కడి ఫ్యాక్టరీల ఓనర్లు రూల్స్ బ్రేక్‌చేస్తూ విచ్చలవిడిగా నీళ్లను వదులుతున్నారు.
10 వేల ఎకరాలకు 2 వేల ఎకరాలు నాశనం
గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, దోమడుగు, అన్నారం, గుమ్మడిదలతో పాటు జిన్నారం మండలంలోని కాజిపల్లి, బొల్లారం, గడ్డపోతారం, కిష్టాయిపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 250 పొల్యూషన్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ పరిశ్రమల పరిధిలో మొత్తం 10 వేల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 వేల ఎకరాలు పనికి రాకుండా పోయాయి. గడ్డపోతారం పారిశ్రామికవాడలో 400 ఎకరాలు, కాజిపల్లి, కిష్టాయిపల్లి పరిధిలో 350, దోమడుగు, అన్నారం పంచాయతీ పరిధిలో 250 , బొల్లారం ఇండస్ట్రియల్ బెల్ట్ లో వెయ్యి ఎకరాల బీళ్లుగా మారాయి. ఏండ్ల కిందే కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావడం, పొల్యూషన్ సమస్య ఎదురుకావడంతో అనేక మంది రైతులు వ్యవసాయం చేయలేక భూములు అమ్ముకున్నారు.
బోరేస్తే రంగు నీళ్లొస్తున్నయ్
జిన్నారం, గుమ్మడిదల ఇండస్ట్రియల్ ఏరియాలో వెయ్యి ఫీట్ల లోతు బోరు వేసినా రంగు నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ల తో వ్యవసాయం చేస్తే పంటలు పండుతలేవు. ఒకవేళ ఎక్కడన్నా పండించినా లోకల్లో ఈ విషయం తెలిసిన వాళ్లు ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. ఇతర ప్రాంతాలకు పోయి పంట అమ్ముకుని వద్దామంటే ట్రాన్స్పోర్ట్చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. అక్కడ కూడా జిన్నారం, గుమ్మడిదల ఏరియాల నుంచి రైతులు పంటలు తీసుకువచ్చారని తెలిస్తే కొనే సాహసం చేయడం లేదు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయం బంజేసి కుటుంబాలను పోషించుకోవడం కోసం కడుపుకొట్టిన పొల్యూషన్ ఫ్యాక్టరీల్లోనే కూలీలుగా చేరుతున్నారు.
కార్మికుడినయ్యా
మాది బొంతపల్లి. బొంతపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీల పొల్యూషన్కారణంగా వ్యవసాయం చేయడం మానేశాను. భూమిలోని నీళ్లన్నీ కలుషితం కావడంతో నాకున్న రెండున్నర ఎకరాల్లో పంటలు పండించే పరిస్థితి లేదు. దీంతో బతకడానికి ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నా. - బీరప్ప, రైతు
బర్లు కాస్తున్న...
మాది దోమడుగు గ్రామం...పొల్యూషన్ తో ఎవుసం ఇడిసిపెట్టి బర్లు కాస్తున్న. వేరే చోట చిన్న చిన్న పనులు చేసుకుంటున్న. నల్లకుంట చెరువు కలుషితం కావడంతో నా రెండు ఎకరాల్లో పంటలు పండట్లేదు. వరి వేస్తే పొల్లుగా వస్తోంది. గింజలు కూడా వస్తలేవు. నష్టపోయిన పంటలకు పరిహారం కూడా ఇస్తలేరు. ఎట్లా బతుకుడు సారు.. - శ్రీధర్ బాబు, రైతు
పరిహారం ఏడవాయే..
పొల్యూషన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని జిల్లా ఆఫీసర్లు ఫ్యాక్టరీల ఓనర్లకు ఆదేశాలిచ్చినా అమలు చేస్తలేరు. నష్టపరిహారాన్ని ఏ,బీ,సీ కేటగిరీలుగా ఆఫీసర్లు డివైడ్చేశారు. ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటే ఏ కేటగిరీ కింద, కొంచెం దూరంలో ఉంటే బీ, ఇంకా దూరంలో ఉంటే సీ కేటగిరీ కింద లెక్క గట్టి ఇవ్వాలి. ఎ కేటగిరీకి సంవత్సరానికి రూ.లక్ష, బీ కి నలబై వేలు, సీ కేటగిరీకి ఇరవై వేలు ఇవ్వాలని పీసీబీ, ఎన్విరాన్మెంట్డిపార్ట్మెంట్లు చెప్పినా లైట్తీసుకుంటున్నారు. ఫ్యాక్టరీలన్నీ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరపున బాధిత రైతులను ఆదుకోవాల్సి ఉన్నా వినడం లేదు.