
- హైదరాబాద్ - మెదక్ రోడ్డుపై
- కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- సర్ది చెప్పి విరమింపజేసిన పోలీసులు
నర్సాపూర్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డుతో పేద రైతులకు అన్యాయం జరుగుతోందని, అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్–- మెదక్ నేషనల్ హైవే పై నర్సాపూర్ మండలంం రెడ్డిపల్లి వద్ద మంగళవారం రైతులు రాస్తారోకో చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దల భూములు పోకుండా ఉండేందుకే అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. మొదట్లో సర్వే చేసి మార్కింగ్ఇచ్చినట్టు కాకుండా, మరోవైపు నుంచి రింగ్‌రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ మార్చడం వల్ల చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోతున్నారన్నారు.
ముందు చేసిన సర్వే ప్రకారమే అలైన్మెంట్ మార్చాలన్నారు. ఏడాదిగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రైతులకు చెప్పకుండా సర్వేలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లేలా చూడాలన్నారు. రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ శివకుమార్ నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఎంపీపీ జ్యోతి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, ఎంపీటీసీ అశోక్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రామా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ఉదయ్, అజ్మత్, నరేశ్, నర్సింహులు, అశోక్ గౌడ్, మహేశ్పాల్గొన్నారు.