కాంటా తెచ్చిన తంటా.. వీణవంకలో బిహార్ కూలీలతో కాంటాలు..పోలీసులు అడ్డుకోవడంతో రైతుల ధర్నా

కాంటా తెచ్చిన తంటా.. వీణవంకలో బిహార్ కూలీలతో కాంటాలు..పోలీసులు అడ్డుకోవడంతో రైతుల ధర్నా

వీణవంక, వెలుగు: ధాన్యం బస్తాలు లోడ్ చేయడానికి స్థానికంగా ఉన్న హమాలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో కొందరు రైతులు బిహార్ కూలీలతో కాంటాలు వేయించారు. స్థానిక హమాలీలు పోలీసుల ద్వారా అడ్డుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ లో శనివారం జరిగింది. నర్సింగాపూర్ లో పలు సీడ్ కంపెనీలు రైతుల ద్వారా ధాన్యం పండించి కొంటున్నాయి. రైతులు వారికి ధాన్యాన్ని విక్రయించేందుకు కాంటా వేసి, లోడింగ్ చేయాల్సి ఉంటుంది. 

అయితే, గతంలో హమాలీ చార్జీ బస్తాకు రూ.40 వసూలు చేయగా.. ఈ సీజన్ లో రూ.60కి పెంచాలని స్థానిక హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైతులు, హమాలీల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో సీడ్ ఆర్గనైజర్లు రెండు రోజుల క్రితం బిహార్ కూలీలను తీసుకొచ్చి బస్తాకు రూ.50 చొప్పున కాంటాలు వేస్తున్నారు. బయటి నుంచి బిహార్​ కూలీలు వచ్చి తమ పొట్ట కొడుతున్నారని స్థానిక హమాలీలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

దీంతో శనివారం బ్లూకోల్ట్స్​ సిబ్బంది నర్సింగాపూర్ కు చేరుకుని బిహార్ కూలీలను కాంటాలు వేయకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ చార్జీలు పెంచితే మాకెలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నించారు. బిహార్​ కూలీలను అడ్డుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ఎస్సై తిరుపతి వారికి సర్దిచెప్పారు. స్థానిక హమాలీలను పిలిచి బిహార్​ కూలీలను అడ్డుకోవద్దని, అవసరమైతే మీరు కూడా అదే కూలీకి పనిచేయాలని వారికి సూచించారు.