పరిహారం కోసం కలెక్టరేట్ బిల్డింగ్​ ఎక్కి నిరసన

పరిహారం కోసం కలెక్టరేట్ బిల్డింగ్​ ఎక్కి నిరసన
  • సిద్దిపేట కలెక్టరేట్​ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆందోళన
  • పైసలు మాత్రమే ఇచ్చి మిగతా హామీలు మరిచారని ఆవేదన

సిద్దిపేట రూరల్, వెలుగు: కలెక్టరేట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన తమకు పూర్తిస్థాయి పరిహారం అందించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి  చెందిన దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన  రైతులు సోమవారం కలెక్టరేట్ బిల్డింగ్​ ఎక్కి నిరసన తెలిపారు.  బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణానికి  దుద్దెడ, రాంపల్లి శివారులోని సర్వేనెంబర్ 663 లో 143మంది  రైతుల నుంచి భూమిని ప్రభుత్వం సేకరించింది.  అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు, 200 గజాల ప్లాటు, భూములలోని బోరుబావులకు, పండ్ల తోటలకు సపరేటుగా నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.  భూములకు మాత్రమే డబ్బులు ఇచ్చి, ప్లాటు, ఉద్యోగం తదితర హామీలను ఆఫీసర్లు మర్చిపోయారని, ఈ విషయమై ఎన్నో సార్లు వారికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు.

దీంతో విసుగు చెందిన గ్రీవెన్స్​లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ కలెక్టరేట్ బిల్డింగ్​ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు వారిని కలెక్టరేట్ పై నుంచి కిందికి దించి వినతిపత్రం అందించేందుకు పర్మిషన్​ ఇవ్వగా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందించి తమ సమస్యను తెలిపారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. వారం, పది రోజుల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వన్ టౌన్ సీఐ భిక్షపతి రైతులను అక్కడి నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనలో రైతులు కొమ్ము మల్లికార్జున్, పిల్లి రాజు, పిల్లి అశ్వత్థామ, నర్సింలు, రాజమల్లయ్య, నర్సయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.