వ్యవసాయ కూలీ రేట్లపై రైతుల ధర్నా.. సూర్యాపేటలో వింత పరిస్థితి

వ్యవసాయ కూలీ రేట్లపై రైతుల ధర్నా.. సూర్యాపేటలో వింత పరిస్థితి

వ్యవసాయ కూలీలు.. కూలీ రేట్ల తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ధర్నాకు దిగిన వింత పరిస్థితి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో జరిగింది. 2024, జనవరి 20వ తేదీ ఉదయం.. పొలాల్లో పని చేయటానికి వ్యవసాయ కూలీల కోసం వచ్చారు రైతులు. 400 రూపాయలు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేశారు.. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం.. 300 రూపాయలే ఇస్తామని.. అంత కంటే ఇవ్వలేం అంటూ రైతుల అడ్డం తిరిగారు. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు.. పొలాల్లో పంట కోతకు వచ్చిందని.. కూలీలు లేకపోతే నష్టపోతాం అంటూ కొందరు రైతులు 400 రూపాయలు ఇవ్వటానికి సిద్ధం అయ్యారు.

ధర్నా చేస్తున్న రైతులు అడ్డుకున్నారు. ఇవాళ అవసరం కదా అని 400 రూపాయలు మీరు ఇస్తున్నారు.. అదే రేటు అందర్నీ ఇవ్వమంటారు.. రేపు 500 రూపాయలు అడుగుతారు.. అప్పుడు ఏం చేస్తారంటూ కొందరు రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యవసాయ పనులు ప్రారంభం అయినప్పుడు ఒప్పందం ప్రకారం 300 రూపాయలు అని నిర్ణయించారని.. ఇప్పుడు 100 రూపాయలు ఎలా పెంచుతారంటూ గ్రామంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో వ్యవసాయ కూలీలు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అన్ని ఖర్చులు పెరిగాయి 400 రూపాయలు ఇస్తేనే వస్తామని వ్యవసాయ కూలీలు.. లేదు 300 రూపాయలు మాత్రమే ఇస్తామని రైతులు పంతాలకు పోయారు. గ్రామంలోని రోడ్డుపై ధర్నాకు దిగారు రైతులు. కూలీ రేట్లు తగ్గించాలని.. 400 రూపాయలు ఇచ్చేది లేదని.. 300 రూపాయలు మాత్రమే ఇస్తామని.. మిగతా రైతులు అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడాలని పిలుపునిచ్చారు.. మొత్తానికి గ్రామంలో కూలీలు, రైతుల మధ్య కూలీ రేట్ల విషయంలో వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి...