మొలకలొస్తున్నా వడ్లు కొనరా?

మొలకలొస్తున్నా వడ్లు కొనరా?

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు
తడిసిన వేల బస్తాలు.. సర్కారు లేట్​ చేస్తోందని ఆందోళన

వెలుగు నెట్ వర్క్: కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లను టైమ్​కు కొనకపోవడంవల్ల పంట మొలకలొచ్చి నిండా మునిగామని రైతులు ఆందోళనకు దిగారు. వడ్లు తడిసిపోయి మొలకెత్తుతున్నా.. కొనరా? అంటూ పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. మొలకలొచ్చిన వడ్లతో నిరసనలు తెలిపారు. వెంటనే వడ్లను కొనాలని, జాప్యం లేకుండా మిల్లులకు పంపాలని డిమాండ్ చేశారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల వడ్లు తడిసిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. వనపర్తిలో బుధవారం రాత్రి కురిసిన వానకు 10 వేల బస్తాల వడ్లు తడిసిపోయాయి. దీంతో రైతులు గురువారం ఉదయం వనపర్తి-, ఆత్మకూరు రోడ్డమీద బైఠాయించి రాస్తారోకో చేశారు. 20 రోజులుగా కొత్తకోట సింగిల్ విండో కొనుగోలు కేంద్రంలో వడ్లు కొంటలేరని ఆరోపించారు. గోనె సంచులు, లారీల కొరత పేరుతో కొనుగోళ్లు ఆపేశారన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడలోనూ రైతులు రాస్తారోకో చేశారు. గోడౌన్లు నిండడం వల్ల కొనుగోలు చేయడం లేదని సొసైటీ ప్రతినిధులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వివిధ  గ్రామాల నుంచి వచ్చిన రైతులు  ధన్వాడ వ్యవసాయ గోదాం వద్ద ధర్నా చేశారు.  

పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట రైతులు రాజీవ్​హైవే మీద గురువారం రాస్తారోకో చేశారు. రైతులు వడ్ల బస్తాలను మోస్తూ రోడ్డుపై నిలబడ్డారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పెద్దపల్లి, బసంత్​నగర్​ పోలీసులు రాస్తారోకో విరమించుకోవాలని రైతులను కోరారు. నెల రోజులుగా సెంటర్లకు వడ్లను తరలించామని, రోజుల తరబడి కాంటాలు పెట్టడంలేదని రైతులు ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు వర్షం పడి ధాన్యం తడిసిందన్నారు. కాంటాలు వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని గురువారం ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నారాయణపురం, తల్లాడ, మల్లారం గ్రామాల రైతులు ఆందోళన చేశారు.  కాంటా వేసి నెల రోజులవుతున్నా మిల్లులకు తరలించకపోవడంతో వడ్లు అకాల వర్షాలకు తడిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  
పురుగులమందు డబ్బాలతో.. 
మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి, ఉప్పరపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు అందోళన చేపట్టారు. బుధవారం రాత్రి వానలకు  ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇనుగుర్తిలో వడ్లను రోడ్డుపై పోసి నిప్పు అట్టించారు. ఉప్పరపల్లిలో తడిసిన వడ్లను కొనాలంటూ పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. మహబూబాబాద్​ మండలం జంగిలిగొండలో వడ్లు కొనడంలేదని నిరసన తెలిపారు. వడ్లు తడసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్​రావు డిమాండ్​ చేశారు.