మోడీ జీ.. మా మన్​కీ బాత్ వినండి

మోడీ జీ.. మా మన్​కీ బాత్ వినండి

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వినతి

డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడి
వరుసగా ఐదో రోజూ కొనసాగిన నిరసనలు
చలి పెరగడంతో టాక్టర్ ట్రాలీల్లో నే షెల్టర్లు
బార్డర్ లో నే గురునానక్ జయంతి జరుపుకున్న రైతులు

న్యూఢిల్లీ/సోనిపట్: పండుగ పూట కూడా ప్రొటెస్టులు ఆగలేదు.. చలికి వణుకుతున్నా నినాదాలు ఆగలేదు.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ప్రొటెస్టులు వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. వేలాది మంది రైతులు ఢిల్లీ చుట్టూ ఉన్న ఐదు ఎంట్రీ పాయింట్లలో నిరసనలు కొనసాగించారు. బురారీలోని నిరంకారి గ్రౌండ్​కు వెళ్లిన వాళ్లు అక్కడే ఆందోళనలు చేశారు. తాడో పేడో తేల్చుకోవాలనే తాము ఢిల్లీకి వచ్చామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సింఘు బార్డర్​లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో రైతు సంఘాల నేతలు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ మన్ కీ బాత్ వినాలని కోరారు. ‘‘మా డిమాండ్లు చర్చించలేనివి. మా ఆందోళనలను అధికార పార్టీ పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిర్ణయాత్మక యుద్ధం చేయడానికి మేం ఇక్కడికి వచ్చాం” అని హెచ్చరించారు. తమ ఆందోళనలు అణచేసేందుకు 31 కేసులు పెట్టారని చెప్పారు. మరోవైపు ట్రాఫిక్ జామ్​ కూడా కొనసాగింది. సింఘు, టిక్రి బార్డర్లు క్లోజ్​లోనే ఉన్నాయని, మిగతా రూట్లలో వాహనదారులు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా హర్యానా ఢిల్లీ బార్డర్​లో రైతులు ప్రార్థనలు చేశారు.

ట్రాక్టర్ ట్రాలీలే షెల్టర్లు

చలి బాగా పెరగడంతో ట్రాక్టర్ ట్రాలీలు, ఇతర వ్యవసాయ పరికరాలే వేలాది మంది రైతులకు టెంపరరీ షెల్టర్లుగా మారాయి. ఐదు రోజులుగా వారికి అవే ఆశ్రయమిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు తగ్గిపోవడంతో ట్రాక్టర్- ట్రాలీలను టార్పాలిన్​తో కప్పి రాత్రిళ్లు తలదాచుకుంటున్నారు. నిజానికి చాలా మంది రైతులు ఒక ట్రాక్టర్​కు రెండు ట్రాలీలు తీసుకుని వచ్చారు. ఒక ట్రాలీలో నిత్యావసరాలు, ఇంకో ట్రాలీలో తాము ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రేషన్, బట్టలు, గ్యాస్ సిలిండర్లు, చద్దర్లు వంటివి వెంట తెచ్చుకున్నారు. హర్యానాలోని సోనిపట్​లో అంబాలా, ఢిల్లీ నేషనల్ హైవేపై దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో ట్రాక్టర్ ట్రాలీలు ఉన్నాయి.

రైతులకు సాయం చేయండి: కేజ్రీవాల్​

తమ సమస్యల పరిష్కారం కోసం ఐదు రోజులుగా పోరాడుతున్న రైతులకు సాయం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ నగరవాసులను కోరారు. వారితో వీలైనంత తొందరగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆప్​ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రైతులకు చేతనైనంత సాయం చేస్తున్నారని చెప్పారు. గడ్డకట్టే చలికి భయపడకుండా వాళ్లు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారని కేజ్రీవాల్​ అన్నారు.

కేంద్రం భరోసా ఇవ్వాలి: నితీశ్

కొత్త చట్టాల వల్ల తమకు మద్దతు ధర రాదని రైతులు భయపడుతున్నారని, ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ అన్నారు. మద్దతు ధర ఎప్పట్లాగే కొనసాగుతుందని భరోసా ఇవ్వాలన్నారు. ఈ ఏడాది కూడా పంటల కొనుగోలు కొనసాగుతుందని  ప్రకటించాలన్నారు.

తోమర్ తో అమిత్ షా భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం భేటీ అయ్యారు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు రెండోసారి సమావేశమయ్యారు. రైతుల ఆందోళనల అంశంపై చర్చించారు.