మనోహరాబాద్, వెలుగు : పంటలకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో వంద మంది రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ఓపెన్ చేసిన వెంటనే యూరియా అందుబాటులో లేదని చూపిస్తోందని, సాంకేతిక సమస్యల కారణంగా బుకింగ్‌కావడం లేదని రైతులు వాపోయారు.
స్మార్ట్ ఫోన్‌వినియోగంపై అవగాహన లేని రైతులు ఇబ్బందులు పడుతున్నందున యాప్ విధానాన్ని తొలగించి గతంలో మాదిరిగానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతను వెంటనే తీర్చాలని లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయంపై మండల వ్యవసాయ అధికారి స్రవంతి మాట్లాడుతూ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా యాప్‌లో యూరియా బుకింగ్‌కావడం లేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
