ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

అశ్వారావుపేట, వెలుగు: కరెంట్​సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ అశ్వారావుపేట మండలం వినాయకపురం విద్యుత్​ సబ్​స్టేషన్ ​ముందు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల కరెంట్​సప్లై చేస్తున్నామని చెబుతోందని, ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మల్లాయిగూడెం, పండువారి గూడెం, కొండతోగు, దిబ్బగూడెం, రామన్నగూడెం అనంతారం, గాండ్లగూడెం గ్రామాలకు ఒక్కరే జేఎల్ఎం ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ట్రాన్స్​ఫార్మర్​ ఫ్యూజ్​పోతే వేసేందుకు రెండురోజులు పడుతోందని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. సమస్యలు పరిష్కరిస్తామని ఏడీ వెంకటేశ్వర్లు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

వైభవంగా సీతారాముల నిత్య కల్యాణం

భద్రాచలం, వెలుగు:  శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం ప్రాకార మండపంలో నిత్య కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులకు బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. సమస్త నదీ జలాలతో తిరుమంజనం జరిగింది. అనంతరం కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. కంకణాలు ధరించిన భక్తులు కన్యాదానం చేసి సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

గ్రీన్ ఫీల్డ్ నిర్వాసితులు ఆందోళన చెందొద్దు 

ఎర్రుపాలెం,వెలుగు: గ్రీన్​ఫీల్డ్​రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని, ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో రవీంద్రనాథ్​ తెలిపారు. బుధవారం తహసీల్​ఆఫీసులో ఎర్రుపాలెం మండలంలోని గ్రీన్​ఫీల్డ్​ నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారం రైతులకు మూడు వంతుల నష్టపరిహరం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సర్వే నిర్వహించి రైతులకు నోటీసులు అందించినట్లు చెప్పారు. అనంతరం ఎర్రుపాలెంలోని సర్దార్ జమలాపురం కేశవరావు మెమోరియల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్​ తిరుమలాచారి, డీటీ కరుణాకర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ఓటు మార్పుచేర్పులపై స్పెషల్​ డ్రైవ్

ఖమ్మం టౌన్, వెలుగు: కొత్త ఓటర్ నమోదుకు అప్లికేషన్స్ స్వీకరించడం, ఓటు మార్పుచేర్పుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్​ వీపీ గౌతమ్​తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్​మధుసూదన్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశం మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు చెప్పారు. అభ్యంతరాలపై నేటి నుంచి వచ్చే నెల 8 వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు చెప్పారు. మార్పులుచేర్పులపై ఈ నెల 26, 27లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ జి.పద్మావతి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శారదా పాల్గొన్నారు.

క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్రీడలతో విద్యార్థుల్తో స్నేహభావం పెరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పాల్వంచలోని సోషల్​ వెల్ఫేర్ ​స్కూల్​లో రాష్ట్ర స్థాయి బాలుర క్రీడా పోటీలను కలెక్టర్​ అనుదీప్​తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. కలెక్టర్​ మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టు జీవితంలో ఎదురయ్యే సమస్యలాంటిదని, గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. సోషల్​ వెల్ఫేర్​ గురుకులాల సొసైటీ అడిషనల్​ సెక్రటరీ హనుమంత్​ నాయక్​ మాట్లాడుతూ రాష్ట్రంలోని 48 స్కూల్స్​ నుంచి 1260 మంది స్టూడెంట్స్​ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. స్టూడెంట్స్​ కల్చరల్ ప్రోగ్రామ్స్​ ఆకట్టుకున్నాయి. 

మొదటి రోజు: అండర్​–14 లాంగ్​ జంప్​ విభాగంలో జె. కార్తీక్​ (సిర్పూర్​) ఫస్ట్​, కె.ఆనంద్​(అన్నపురెడ్డిపల్లి) సెకండ్​, కె. సాత్విక్​(జైపూర్​) థర్డ్​ ప్లేస్​ లో నిలిచారు. అండర్​-19 విభాగంలో ఎం. దేవెందర్​(ఏటూరునగరం) మొదటి, జి. వంశీ(చర్ల) సెకండ్, ఎం.హరిప్రసాద్​(కొహెడ) థర్డ్, షాట్​పుట్​ అండర్–14 విభాగంలో  కె. ఆనంద్​(అన్నపురెడ్డిపల్లి) ఫస్ట్​, ఎం. శివాజీ(బోధన్​) సెకండ్​, ఎన్​.రాంచరణ్​(నర్సంపేట) థర్డ్​ ప్లేస్, షాట్​పుట్​ విభాగంలో కె. సంజయ్​(కాజీపేట), డి. ముఖేశ్​(అన్నపురెడ్డిపల్లి), కె. గణేష్​(పాల్వంచ) వరుసగా మొదటి, రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. అండర్​–17 విభాగంలో కె. సాగర్​ (మరిపెడ) ఫస్ట్​, డి. శ్యాంసుందర్​(కోటపల్లి) సెకండ్​, ఎ. ఆదర్శ్​(కాసీపేట) థర్డ్​ప్లేస్​ సాధించారు. 

కార్పొరేట్ కు దీటుగా సర్కార్ దవాఖానాలు

అశ్వారావుపేట, వెలుగు: సర్కార్​దవాఖానాల్లో కార్పొరేట్​హాస్పిటల్స్​కు దీటుగా సేవలు అందుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. బుధవారం అశ్వారావుపేట సీహెచ్ సీ ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్​ 
మాట్లాడుతూ మాట్లాడుతూ కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అశ్వారావుపేట సీహెచ్​సీలో గతంలో ముగ్గురు డాక్టర్లు ఉండగా అదనంగా మరో ఆరుగురిని నియమించినట్లు చెప్పారు. 24 గంటలు పేషంట్లకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

త్వరలో అదనంగా గైనకాలజిస్ట్ ను కూడా నియమిస్తామని కలెక్టర్ ​తెలిపారు. అశ్వారావుపేట పేపర్ బోర్డు ఆర్థిక సాయంతో ఓపీ బ్లాక్ భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబునాయక్, సూపరింటెండెంట్​జయలక్ష్మి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, అశ్వారావుపేట, పేరాయి గూడెం సర్పంచులు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, ఎంపీటీసీ భారతి పాల్గొన్నారు.

ముక్కోటి పనులకు టెండర్లు ఖరారు

భద్రాచలం, వెలుగు: ముక్కోటి వైకుంఠ ఏకాదశి 2022–-23 పనులకు టెండర్లు ఖరారయ్యాయి. 2023 జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం, 2న  వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం పనులు చేపడుతోంది. 14 పనులకు టెండర్లు ఆహ్వానిస్తే 2 పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు కాలేదు. రూ.75.99లక్షల అంచనా వ్యయంతో 14పనులకు టెండర్లు పిలిస్తే రూ.66,67,064 విలువ చేసే 12 పనులకు టెండర్లు ఖరారయ్యాయి.

భద్రాచలం ప్రధాన ఆలయంతోపాటు పర్ణశాల రామాలయం, గోదావరి ఘాట్లకు రంగులు, నాలుగు ఆర్చీ గేట్లకు రంగులు, లైటింగ్, భద్రాచలంలో కరకట్టపై ఉన్న రామాయణ శిల్పాలు, నిత్య కల్యాణ మండపానికి రంగులు, 17,468 చ.అడుగుల చలువ పందిళ్ల నిర్మాణాలు, 46,332 చదరపు  అడుగుల మేర తాత్కాలిక వసతి, ఎల్ఈడీ స్క్రీన్ లు, ఫ్లైవుడ్​ ఆర్చీ గేట్లు, గోశాల ముందు గ్వాలియం షెడ్​.. తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.  తెప్పోత్సవం రోజున పటాకులు కాల్చేందుకు, తాత్కాలిక వసతికి షెడ్లు నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంకా తెప్పోత్సవానికి హంసావాహనం, ర్యాంపు నిర్మాణం కోసం టెండర్లు జరగాల్సి ఉందని ఈఈ రవీందర్​రాజు తెలిపారు.

ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నిరుపేదల తరఫున కేసు వాదించేందుకు జిల్లాకు లీగల్​ ఎయిడ్​ డిఫెన్స్​ కౌన్సిల్​ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్​ తెలిపారు. న్యాయసేవల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా కోర్టులో బుధవారం ఆయన మాట్లాడారు. పేదలకు నాణ్యమైన న్యాయ సేవలందించేందుకు గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ ప్రదర్శనను కాలేజీ స్టూడెంట్స్​ తిలకించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.శ్యామ్, జడ్జీలు జి. భానుమతి, ఎ. నీరజ, బి.రామారావు, కె.దీప, ఏపీపీ రాధాకృష్ణమూర్తి, పీడీవీ లక్ష్మి పాల్గొన్నారు.