పంటను కాపాడుకునేందుకు పాట్లు!..తుఫానులో తడిచిన వడ్లు, పత్తి, మొక్క జొన్నలు

పంటను కాపాడుకునేందుకు పాట్లు!..తుఫానులో తడిచిన వడ్లు, పత్తి, మొక్క జొన్నలు
  • వర్షంతో నేలవాలిన మిర్చి, వరిని నిలబెడుతున్న రైతులు
  • 62 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా
  • శాఖల వారీగా నష్టాలపై జిల్లా అధికారుల రివ్యూ

ఖమ్మం/ తల్లాడ/ ఎర్రుపాలెం, వెలుగు:  మొంథా తుఫాను ఈదురుగాలుల కారణంగా నేలవాలిన పంటలను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నాలుగు రోజుల కింద రోజంతా వర్షం పడడంతో తడిచిన వరి, పత్తి, మిర్చి చేల నుంచి నీటిని బయటకు పంపేందుకు కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  వరుసగా రెండ్రోజుల నుంచి ఎండ కొడుతుండడంతో తడిచిన పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అదే సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పొలాల్లో నీటి కాలువ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపాలని సూచిస్తున్నారు. వడ్ల గింజ రంగు మారకుండా, పత్తి పూత రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతున్నారు. 

ఇప్పటికే జిల్లాలో 62,400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేయగా, పూర్తి స్థాయిలో ప్రస్తుతం పంట నష్టం సర్వే నిర్వహిస్తున్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతం పంట నష్టం జరిగిన రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. 

అదనపు ఖర్చు!

వరి పంట, పత్తి చేతికి వచ్చే సమయంలో తుఫాను రావడంతో వాటిని దక్కించుకునేందుకు అన్నదాతలు మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తోంది. వరి కోత మిషన్ ద్వారా పంట కోయించాలంటే అడ్డంపడిన వరిని తాడు సాయంతో దుబ్బలుగా కట్టాలి. వరి కంకుల బరువు కారణంగా నేలవాలిన పొలాలను తాళ్ల సాయంతో కొందరు రైతులు నిలబెట్టుకునేందుకు, మిర్చి తోటల్లో మొదళ్ల దగ్గర కూలీలతో తొక్కించేందుకు అదనపు ఖర్చు పెడుతున్నారు.

 తడిచిన పత్తిని ఆరబెట్టుకుంటూ, తేమ శాతం తగ్గించుకుంటున్నారు. మరోవైపు మొక్కజొన్న రంగు మారడంతో వాటిని ఎండబెడుతున్నారు. వీటన్నింటి కోసం కూలీలపైనే  ఆధారపడాల్సిన పరిస్థితి. పత్తి, వరి.. పంట ఏదైనా తేమ శాతం నిబంధనల ప్రకారం తక్కువగా ఉండకపోతే మద్దతు ధర దక్కే అవకాశం లేకపోవడంతో వాటిని తప్పనిసరిగా ఎండబెట్టాల్సిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తుఫాను నష్టం అంచనాలపై ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా నష్టం వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. 

రూ.30 వేలు అదనపు ఖర్చు

ఈ ఏడాది 5 ఎకరాలు కౌలుకి తీసుకొని మిర్చి పంట వేశాను. గతేడాది కంటే ఈ సారి మొక్కలు ఏపుగా పెరిగాయి అనుకున్న సమయంలో తుఫాను కారణంగా మొక్కలు పడిపోయాయి. దీంతో కూలీలతో పడిపోయిన మొక్కలను మళ్లీ సరి చేశాం. దీని కోసం అదనంగా రూ.30 వేలు ఖర్చు అయింది. – బీరెల్లి సామేలు, అన్నారుగూడెం, తల్లాడ మండలం 

నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి

తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం గ్రామ స్థాయిలో సర్వే జరుగుతోంది. 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి, నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.- ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి