కంపెనీలకు లాభం చేకూర్చేందుకే విత్తన చట్టం : రైతు సంఘాల నేతలు

కంపెనీలకు లాభం చేకూర్చేందుకే విత్తన చట్టం : రైతు సంఘాల నేతలు
  •     కేంద్రం తెచ్చిన ముసాయిదా బిల్లుపై రైతు సంఘాల అభ్యంతరం
  •     పరీక్షలు లేకుండా విదేశీ విత్తనాల దిగుమతిపై ఆగ్రహం

 హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘విత్తన ముసాయిదా బిల్లు-2025’పై రైతు సంఘాల నేతలు, నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు పంట నష్టపరిహారం అంశంపై స్పష్టత లేకపోవడం.. విదేశీ విత్తనాలను ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా దిగుమతి చేసుకుని అమ్మేందుకు అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో  రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన మంగళవారం బీఆర్కే భవన్​ లో ముసాయిదా బిల్లుపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్​ రెడ్డి, ఆల్ ఇండియా కిసాన్​సభ నేత సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు చందర్రావు, హార్టికల్చర్ యూనివర్సిటీ  వీసీ రాజీరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్, భవానీరెడ్డి, పశ్యపద్మ, కిసాన్ కాంగ్రెస్ నేతలు పత్తి కృష్ణారెడ్డి, ఆదిరెడ్డి, బీజేపీ నేతలు ప్రకాశ్ రెడ్డి, శ్రీధర్​ రెడ్డి, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని తమ అభ్యంతరాలు వెల్లడించారు. 

కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టం వెనక బహుళజాతి కంపెనీల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ‘‘విత్తనం రైతు హక్కు. రైతుకు భూమి హక్కు ఉన్నట్టే.. విత్తన హక్కు కూడా ఉండాలి. కానీ, ఇప్పుడు విత్తనం పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. విత్తనాల ధరలపై నియంత్రణ లేదు. సెల్ఫ్ సర్టిఫికేషన్​తోనే కంపెనీలు అమ్ముకునేలా చూస్తోంది. రైతులకు లాభం చేకూర్చే చట్టం కావాలి కానీ.. ఇది మల్టీనేషనల్ కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉంది’’ అని మండిపడ్డారు. 

పరిహారంపై స్పష్టత లేదు: అన్వేష్​ రెడ్డి 

పంట నష్టం జరిగితే రైతుకు వెంటనే పరిహారం రావాలని.. కానీ, ఈ ముసాయిదా చట్టంలో ఆ స్పష్టత లేదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్​ రెడ్డి అన్నారు. విత్తనం అమ్మిన వ్యక్తి మీద కేసులు పెట్టారు తప్ప.. కంపెనీ మీద పెట్టలేదని, ఇలాంటి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆలిండియా కిసాన్​సభ నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టం వల్ల నష్టపోయేది తెలంగాణ రైతులేనని అన్నారు. 

రైతు సంఘం నాయకుడు చందర్రావు మాట్లాడుతూ.. వేరే దేశాల్లో తయారైన విత్తనాలు ఇక్కడకు వచ్చిన తర్వాత ఫెయిలైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హార్టీకల్చర్ వర్సిటీ వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ.. విత్తనం ఫెయిల్ అయితే రైతుకు నష్టపరిహారం ఎన్ని రోజుల్లో అందుతుందో ముందే చెప్పాలన్నారు. ఈ బిల్లుకు సవరణలు చేయకపోతే రైతులకు నష్టం జరుగుతుందని సమావేశంలో పాల్గొన్న వారంతా అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు చర్చల దశలో ఉందని, సూచనలు స్వీకరించి సవరణలు చేస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు.