
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.4.50కోట్ల నిధులు రిలీజ్
- కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాను భరించనున్న ప్రభుత్వాలు
భద్రాచలం,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దశాబ్దకాలం తర్వాత అన్నదాతలకు రాయితీలు వస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇస్తోంది. గతంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాయితీలు ఇచ్చేవి. కానీ కొంత కాలంగా ఇవ్వడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2025–-26 సంవత్సరానికి స్మామ్(సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలా కాలం తర్వాత రాయితీలు రావడంలో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
రూ.4.50కోట్ల నిధులు రిలీజ్
జిల్లాలో మొత్తం 1,88,702 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో సాధారణంగా 5,91,714 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 2025–-26 సంవత్సరానికి రాయితీ యంత్ర పరికరాల కోసం రూ.4.50కోట్లు రిలీజ్ అయ్యాయి. 5,594 పరికరాలను రైతులకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం, ఇతరులకు 40శాతం వరకు రాయితీపై పరికరాలను ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం40శాతం, కేంద్ర ప్రభుత్వం 60శాతం వాటాను భరించనున్నాయి. పట్టాభూమి కలిగిన ప్రతీ రైతు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌కార్డు జత చేసి అప్లికేషన్లను స్థానిక అగ్రికల్చర్ ఆఫీసులో అందజేయాలి. అప్లికేషన్లను ఆఫీసర్లు ఆన్లైన్ చేస్తారు. ట్రాక్టర్ అనుబంధ పరికరాలు కావాల్సిన వారు ట్రాక్టర్ ఆర్సీ కచ్చితంగా అందజేయాలి.
ఎంపిక ఇలా..
తహసీల్దారు, ఎంపీడీవో, అగ్రికల్చర్ ఆఫీసర్ సభ్యులుగా మండల స్థాయి ఎంపిక కమిటీ ఉంటుంది. రూ.లక్ష లోపు పరికరాలకు ఏడీఏ, రూ.లక్ష పైబడి పరికరాలకు డీఏవో ప్రొసీడింగ్ ఇస్తారు. ప్రతీ మండలానికి కేటాయింపులున్నాయి. ఆసక్తి కల్గిన రైతులు స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్లు తెలిపారు. జిల్లాకు పవర్ వీడర్లు 25, బ్రష్ కట్టర్లు 50, పవర్ టిల్లర్లు 33, మేజ్ షెల్లర్స్ 20, వరిగడ్డిమోపు కట్టే యంత్రాలు 29, చేతిపంపులు 4244, పవర్ స్ప్రేయర్లు 622, రోటోవేటర్లు 205, సీడ్కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లు 46, రేజ్వీల్, రోటోపడ్లర్లు 276, బండ్ఫార్మర్లు 44
మంజూరయ్యాయి.