కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు ఫెయిల్

కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు ఫెయిల్
  • మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న రైతులు
  • హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రుల ప్రతిపాదన
  • కొత్త చట్టాలు డెత్ వారెంట్ల లాంటివని రైతుల కామెంట్స్
  • పరిష్కారం రాకుండానే ముగిసిన మారథాన్ మీటింగ్
  • గురువారం మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయం

న్యూఢిల్లీ/చండీగఢ్కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను 35 రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. అయితే చట్టాలను విత్ డ్రా చేసుకోబోమని స్పష్టం చేసిన కేంద్రం.. మండీలు, కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) విషయంలో రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. హై లెవెల్ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను రైతు ప్రతినిధులు మరింతగా పరిశీలించాలని కోరింది. కానీ రైతులు ఈ ప్రపోజల్​కు ఒప్పుకోకపోవడంతో.. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి కొన్ని గంటలపాటు సాగిన మీటింగ్ ఎలాంటి తీర్మానం లేకుండానే ముగిసింది. అయితే చర్చలు కొనసాగుతాయని, గురువారం (3వ తేదీ) మరోసారి సమావేశం కావాలని రైతు సంఘాలను ఆహ్వానించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మారథాన్ మీటింగ్

35 మందితో కూడిన రైతుల బృందంతో కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్, సీనియర్ అధికారులు మంగళవారం చర్చలు జరిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన మీటింగ్ సాయంత్రం దాకా సుదీర్ఘంగా కొనసాగింది. ప్రభుత్వం ఎలాంటి కండిషన్లు లేకుండా చర్చలకు పిలవడంతో ఒప్పుకున్నామని రైతులు చెప్పారు. 35 రైతు సంఘాలతో మీటింగ్ తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధులు అగ్రికల్చర్​ మినిస్ట్రీతో చర్చలు జరిపారు. అయితే ముందుగా జరిగిన మీటింగ్​కు వెళ్లేందుకు పంజాబ్​కు చెందిన రైతు సంఘం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కేఎంఎస్​సీ) నిరాకరించింది. ‘‘పలు రైతు సంఘాలను మీటింగ్​కు పిలవలేదు. ప్రధాని మోడీ ఈ మీటింగ్ నిర్వహించలేదు. అందుకే మేం చర్చలకు వెళ్లడం లేదు” అని కేఎంఎస్​సీ జనరల్ సెక్రెటరీ సర్వాన్ సింగ్ పాంధెర్ చెప్పారు. రైతులను విడదీయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

మాకు ఎలాంటి మంచి చేయొద్దు!

‘‘పెద్దపెద్ద కార్పొరేట్ల చేతుల్లోకి మా భూములు వెళ్లేలా మీరు చట్టం తెచ్చారు. ఇందులోకి కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేయకండి. సమస్యను పరిష్కరించేందుకు ప్యానెల్ లేదా కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇది టైం కాదు. ‘రైతులకు మంచి చేయాలని అనుకుంటున్నాం’ అని మీరు అంటున్నారు. ‘మాకు ఎలాంటి మంచి చేయొద్దు’ అని మేం చెబుతున్నాం’’ అని రైతుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కొత్త చట్టాలు రైతులకు డెత్ వారెంట్ల లాంటివని
చెప్పారు.

ఆరో రోజూ..

ఢిల్లీ బార్డర్​లో మంగళవారం భారీగా పోలీసులను మోహరించారు. కాంక్రీట్ బారియర్లు, మల్టీలేయర్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆరో రోజు కూడా వేలాది మంది రైతులు టిక్రి, సింఘు, ఘాజి బార్డర్స్​లో శాంతియుతంగా తమ నిరసనలు కొనసాగించారు. సిటీ ఎంట్రీ పాయింట్లలో వెహికల్ చెకింగ్స్ పెంచినట్లు పోలీసులు చెప్పారు. ఇక వందలాది మంది రైతులు నోయిడా, ఢిల్లీ బార్డర్​ను బ్లాక్ చేశారు. ట్రాఫిక్ ను బంద్ చేశారు.

మాజీ క్రీడాకారుల అవార్డ్ వాపసీ

పద్మశ్రీ, అర్జున సహా పలు అవార్డులు అందుకున్న మాజీ స్పోర్ట్స్ పర్సన్లు రైతులకు మద్దతు ప్రకటించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ బలప్రయోగానికి నిరసనగా తమ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఇందులో రెజ్లర్ కర్తార్ సింగ్, బాస్కెట్​బాల్ ప్లేయర్ సజ్జన్ సింగ్ చీమా, హాకీ ప్లేయర్ రాజ్​బీర్ కౌర్ తదితరులు ఉన్నారు. ఈనెల 5న తాము ఢిల్లీకి వెళ్తామని, రాష్ట్రపతి భవన్ బయట తమ అవార్డులను ఉంచుతామని వీరు తెలిపారు. ‘‘మేం రైతు బిడ్డలం. వారు కొన్ని నెలలుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటిదాకా ఎక్కడా ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదు. కానీ రైతులు ఢిల్లీ వెళ్తుండగా వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్​లు ప్రయోగించి అడ్డుకోవాలని చూశారు. మా పెద్దలు, సోదరుల తలపాగాలు నేలకొరిగిన తర్వాత.. ఈ అవార్డులు, గౌరవాలతో మేం ఏం చేసుకోవాలి? మేం రైతులకు మద్దతుగా ఉంటాం. ఈ అవార్డులు మాకు వద్దు. అందుకే వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నాం”అని చీమా చెప్పారు.

చర్చలు మూడో ‘సారి’

రైతులు, ప్రభుత్వానికి మధ్య కొన్ని నెలల వ్యవధిలో మూడు సార్లు చర్చలు జరిగాయి. అగ్రికల్చర్ సెక్రటరీ సంజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఫస్ట్ రౌండ్  చర్చలు జరిగాయి. తర్వాత నవంబర్ 13న కేంద్ర మంత్రులు తోమర్, గోయల్ ఆధ్వర్యంలో రెండో రౌండ్ మీటింగ్ జరిగింది. మంగళవారం జరిగిన సమావేశం మూడోది. కానీ మూడు సార్లూ చర్చల్లో ఏకాభిప్రాయం రాలేదు.

అంతమంది వస్తే ఏకాభిప్రాయం కష్టం

రైతు సంఘాల ప్రతినిధులు చాలా మంది ఉన్నారని, అంతమంది ఉన్నప్పుడు ఏకాభిప్రాయం రావడం కష్టమని మంత్రులు అభిప్రాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీంతో రైతులు తక్కువ సంఖ్యలో చర్చలకు రావాలని సూచించినట్లు తెలిపాయి. అయితే రైతులు మాత్రం తామందరం కలిసే వస్తామని స్పష్టం చేశారని వెల్లడించాయి. ‘‘చర్చలు సరిగ్గా సాగాలంటే 5 నుంచి ఏడుగురు ప్రతినిధులు రావాలని ప్రభుత్వం కోరింది. కానీ దాన్ని మేం తిరస్కరించాం. మేమంతా చర్చల్లో ఉండాల్సిందే” అని బీకేయూ(దకౌండా) బతిండా జిల్లా ప్రెసిడెంట్ బల్దేవ్ సింగ్ చెప్పారు. తమను విభజించాలనే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.

బిల్కిస్ దీదీని  వెనక్కి పంపిన పోలీసులు

సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్​కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి, షహీన్​బాగ్​ దీదీగా వార్తల్లోకి ఎక్కిన బిల్కిస్ దీదీని సింఘు బార్డర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచేందుకు ఆమె ఢిల్లీ హర్యానా బార్డర్​కు వెళ్లారు. అయితే దీదీ అక్కడికి రాగానే పోలీసులు ఆపేశారు. ఎస్కార్ట్​గా ఉండి సౌత్ ఢిల్లీలోని తన ఇంటికి పంపారు.