రుణమాఫీ కాని రైతులు టెన్షన్​ పడొద్దు: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

రుణమాఫీ కాని రైతులు టెన్షన్​ పడొద్దు: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
  • టెక్నికల్​ సమస్యలతో కొందరికి కాలే.. వాళ్లకూ మాఫీ చేస్తున్నం
  • రూ. 2 లక్షలపైన లోన్లున్నోళ్లు బ్యాలెన్స్​ అమౌంట్ కడ్తే మాఫీకి అర్హులే
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ
  • గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్​ సెల్స్​ ఏర్పాటు చేసినం
  • బాధిత రైతులు అధికారులను కలిసి మాఫీని పొందాలి
  • తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం
  • ఇప్పటివరకు 22 లక్షల మందిని రుణవిముక్తులను చేసినం
  • బీఆర్​ఎస్ నేతలవి దిగజారుడు రాజకీయాలు
  • వాళ్లు రూ. 9 వేల కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. రూ. 2 లక్షల పైన లోన్​ ఉన్న రైతులు.. ఆపై(రూ. 2 లక్షలు పోను) బ్యాలెన్స్​అమౌంట్​ను బ్యాంకులకు చెల్లిస్తే మిగిలిన రెండు లక్షలు మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణం ఉంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2 లక్షలు బ్యాంక్​ అకౌంట్​లో పడ్తాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులెవరూ ఆందోళన చెందొద్దని.. ఇంకా కొందరికి టెక్నికల్​సమస్యల వల్ల లోన్​అకౌంట్లల్లో డబ్బులు జమకాలేదని, ఇలాంటివాళ్ల కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో గ్రీవెన్స్​ సెల్స్​ ఏర్పాటు చేశామని తెలిపారు.

తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, గ్రీవెన్స్​ సెల్స్​ను సంప్రదించి రుణమాఫీ పొందాలని మంత్రి తుమ్మల శనివారం ఒక ప్రకటనలో కోరారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. 

బీఆర్​ఎస్​వి దిగజారుడు రాజకీయాలు

రుణమాఫీ విషయంలో అర్హులెవరికీ అన్యాయం జరగకుండా తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సహకరించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మండిపడ్డారు. బీఆర్​ఎస్​ లీడర్లకు రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి హయాంలో వదిలేసిన రూ. 9 వేల కోట్ల లోన్లను మాఫీ చేయాలని సవాల్ విసిరారు.

రూ. 2 లక్షలు పైబడిన లోన్లు ఉన్న రైతులు బ్యాలెన్స్​అమౌంట్​ బ్యాంకులకు చెల్లిస్తేనే మిగిలిన రెండు లక్షలను  మాఫీ చేస్తామనే విషయాన్ని ఇప్పటికే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్​ మీడియా ద్వారా చేరవేశామని మంత్రి తెలిపారు. రూ. 2 లక్షల వరకు లోన్లు ఉన్న కొందరు రైతులకు పలు సాంకేతిక సమస్యల వల్ల మాఫీ వర్తించలేదని, అలాంటివారి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన గ్రీవెన్స్​ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు.  ఈ విషయంలో రైతులకు సాయం చేసేందుకు బ్యాంకులు, అగ్రికల్చర్​ఆఫీసుల దగ్గర కూడా నోడల్ ఆఫీసర్లను నియమించామని, వాళ్లను బాధితులు సంప్రదించాలని మంత్రి సూచించారు.

ఇప్పటిదాకా 22 లక్షల మందికి రుణవిముక్తి  

ఇప్పటి వరకు రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న 22 లక్షల 37 వేల 848 మంది రైతుల ఖాతాల్లో రూ. 17,933.19 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు వెల్లడించారు. మొదటివిడతలో జులై 18న  రూ. లక్షలోపు రుణాలున్న 11 లక్షల 50 వేల 193 మంది రైతులకు రూ. 6,098.93 కోట్లు..  రెండో విడతలో జులై 30న రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలు ఉన్న 6,40,823 మంది రైతులకు రూ.6,190.01 కోట్లు విడుదల చేశామన్నారు. 

మూడో విడతలో ఆగస్టు 15న రూ. 2 లక్షలలోపు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల లోన్​అకౌంట్లలో రూ.5,644.24 కోట్ల నిధులు జమ చేసి.. రుణవిముక్తుల్ని చేశామన్నారు. రుణమాఫీతో పాటు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.26,140 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు.  ఇందులో గత ప్రభుత్వం పెండింగ్‌‌లో పెట్టిన బకాయిలన్నీ చెల్లించామని, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ పాం రైతులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలను చెల్లించామన్నారు. తమది చేతల ప్రభుత్వమని, బీఆర్ఎస్​లాగా తమకు దిగజారుడు రాజకీయాలు చేతకావని ఆయన తెలిపారు.

తప్పులు సరిదిద్ది..పైసలు వేస్తున్నం..

బ్యాంకు అకౌంట్లు, ఆధార్​నంబర్లలో పొరపాట్లు ఉన్నవి.. కుటుంబ నిర్ధారణ జరగని అకౌంట్లు..  బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్​లో ఉన్న పేర్లతో లింక్​కాని అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమకాలేదని మంత్రి తుమ్మల అన్నారు. వీటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీవెన్స్​ల ద్వారా అవకాశం కల్పించిందని తెలిపారు. బ్యాంకుల్లో టెక్నికల్ సమస్యల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని, వీటిలో ఉన్న తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నామని, ఈ క్రమంలో ఇప్పటికే  8 వేల ఖాతాలకు రీఫండ్​చేశామని వెల్లడించారు. అందువల్ల అన్ని అర్హతలు ఉండి, లోన్లు మాఫీకాని రైతులు వ్యవసాయ అధికారులను  సంప్రదించి, తగిన వివరాలు సమర్పిస్తే వారందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. 

రైతు కుటుంబాల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు స్వయంగా రైతుల ఇండ్లకు వెళ్లి ఖాతాదారులు, వారి ఫ్యామిలీ వివరాలు, ఆధార్ వివరాలు తీసుకుని పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారని అన్నారు.  ఒకవేళ బ్యాంకు సమర్పించిన అసలు, వడ్డీలలో ఏమైనా తేడా ఉంటే రైతులు వ్యవసాయాధికారులకు తెలియజేయాలని సూచించారు. -ప్రతి జిల్లా వ్యవసాయాధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారీ అందిన  ఫిర్యాదులను సాయంత్రం 5 గంటలలోపు వ్యవసాయశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారన్నారు.- అంతేతప్ప బీఆర్ఎస్​, ఇతర ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు రైతులను కోరారు.   

మాఫీ కాకుంటే ఇట్ల చేయాలి..!

  • ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పట్టా పాస్​బుక్ సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది.
  • బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్​లో తప్పులున్నవి, పట్టా పాస్ బుక్  నంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లోని పేర్లతో ఆధార్​లోని పేర్లు సరిపోలని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్​లో ఉంది. ఇలాంటి సమస్యలున్న రైతులు స్థానిక మండల వ్యవసాయాధికారిని కలిసి, సరి చేసుకుంటే వారి ఖాతాల్లోనూ రుణమాఫీ నిధులు పడతాయి.
  • ఆధార్​లో తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్​తో పాటు ఓటర్ ఐడీ లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును అధికారులకు అందించాలి. వాటిని పోర్టల్​లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా మాఫీ పొందొచ్చు. 
  • కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో మాఫీ కాకపోతే..  అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.  
  • ఆధార్​, బ్యాంకు ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే..  సరైన పేరున్న అప్​డేటెడ్​ ఆధార్ కార్డును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
  • రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది.