హర్యానాలో వరంగల్​ రైతుల అరిగోస

హర్యానాలో వరంగల్​ రైతుల అరిగోస

వరంగల్‍/ నర్సంపేట, వెలుగు :  ఎస్సీ కార్పొరేషన్‍ కింద పాడి గేదెలు ఇస్తామంటే నమ్మి హర్యానా వెళ్లిన రైతులు అష్టకష్టాలు పడ్డారు. తీసుకెళ్లిన ఆఫీసర్లు మధ్యలో వదిలేసి వెళ్లడంతో అక్కడి భాష రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్​లో అడ్రస్​  కనుక్కొని ఎలాగో గేదెలున్న చోటుకు చేరుకోగా, అక్కడి దళారులు కమీషన్​ డిమాండ్ ​చేశారు. ఒప్పుకోకపోవడంతో బంధించారని, చివరకు బయటపడి ఇంటి దారి పట్టామని వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. ఎస్సీ కార్పొరేషన్‍ మినీ డైరీ పైలెట్‍ ప్రాజెక్ట్‍ కింద 2018–19 సంవత్సరానికి గాను వరంగల్‍ జిల్లా నల్లబెల్లి మండలం నుంచి 21, నెక్కొండ 8, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మరో 18  మంది ఎంపికయ్యారు.

స్కీంలో భాగంగా రూ.4 లక్షలతో నాలుగు మేలుజాతి పాడి గేదెలు ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. హర్యానా రాష్ట్రం నుంచి తీసుకువద్దామని చెప్పి హనుమకొండ, వరంగల్‍ ఎస్సీ కార్పొరేషన్‍ కు చెందిన ఇద్దరు ఏడీలు మార్చి 26న నిజాముద్దీన్‍ ట్రైన్​లో జనరల్‍ టికెట్లు బుక్‍ చేశారు. ఆఫీసర్లు వేరే బోగిలో వస్తున్నామని చెప్పారు. జర్నీలో కనీసం తిండి, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. వెంట తీసుకెళ్లిన డబ్బులతో ఆహారం కొనుక్కుని తినాల్సి వచ్చింది. తీరా హర్యానాలో దిగాక చూస్తే ఆఫీసర్లిద్దరూ కనిపించలేదు. ఇచ్చిన నంబర్లకు ఫోన్‍ చేస్తే ఎత్తలేదు. ఏం చేయాలో పాలుపోక రోహతక్‍ జిల్లాలోని కురానా డైరీ ఫారానికి చేరుకొని బర్రెలను  ఎంపిక చేసుకొని ఆఫీసర్లకు మెసేజ్​ చేశారు.  

అధికారులు జిందూ జిల్లాలోని అక్షయ డైరీ ఫారంకే వెళ్లాలని, అక్కడి బర్రెలనే తీసుకోవాలని కండీషన్​ పెట్టారు. అక్కడికి వెళ్లాక ఆఫీసర్లతో కలిసిన దళారులు ఒక్కో బర్రెకు రూ.30 వేల చొప్పున కమీషన్‍ అడిగారు.  గతంలో ఇక్కడి నుంచి తీసుకువచ్చిన బర్రెలు పాలివ్వక తమ ఊరిలోని వాళ్లు నష్టపోయారని లబ్ధిదారులు చెప్పడంతో అధికారులు రైతులను అక్కడే వదిలేసి వచ్చారు. దళారులు ఒకటి రెండురోజులు రైతులను బంధించి మభ్యపెట్టే ప్రయత్నం చేసినా వినలేదు. గేట్లు తీయాలని ధర్నా చేసి బయటపడ్డారు. తమ బాధలను ఎస్సీ కార్పొరేషన్‍ ఈడీకి చెప్పుకునేందుకు ఫోన్​చేయగా స్పందించలేదు. తెచ్చుకున్న పైసలు అయిపోవడంతో బిచ్చమెత్తుకున్నామని, చివరికి కుటుంబ సభ్యులు  ఫోన్‍ చేసి గూగూల్‍ పే ద్వారా డబ్బులు పంపితే తిరిగివచ్చామన్నారు. సోమవారం హైదరాబాద్‍ చేరుకుని మంత్రి కేటీఆర్‍ను కలిసి వారం పాటు తాముపడ్డ కష్టాలను వివరించి, అధికారులపై చర్యలను తీసుకోవాలని కోరారు.   

వారం రోజులు నరకయాతన అనుభవించినం

పాడి గేదెల పైలట్​ ప్రాజెక్టు కోసం నేను సెలక్టయ్యా. మార్చి 26న వరంగల్​ రైల్వే స్టేషన్​ నుంచి హర్యానా​కు 44 మందితో కలిసి బయలుదేరా. పెద్దాఫీసర్లు కాకుండా ఇద్దరు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపించారు. రోహతక్​ జిల్లాలో పాడి గేదెల ఏజెన్సీలు ఐదు ఉంటే మాకు నచ్చిన ఏజెన్సీలో బర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని ఆఫీసర్లను అడిగాం. వారు రాకపోగా.. ఆ ఏజెన్సీ బర్రెలను  కొనివ్వలేమని ఖరాఖండిగా చెప్పారు. ఎంత బతిమిలాడినా మేం ఎంచుకున్న ఏజెన్సీలో క్వాలిటీ పాడి గేదెలు ఇవ్వలేదు. వారం పాటు నరకయాతన అనుభవించాం. తెచ్చుకున్నడబ్బులు అయిపోవడంతో ఇబ్బందులు పడ్డాం. ఫోన్​పే ద్వారా దాతల సహకారంతో డబ్బులు అడుక్కుని బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం. హైదరాబాద్​కు చేరుకుని మంత్రి కేటీఆర్​ను కలిసి మా గోడును వెళ్లబోసుకున్నాం. 

- బొట్ల నరేశ్​, ముచ్చింపుల,నల్లబెల్లి, వరంగల్‍ జిల్లా