ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఎఫ్‍ఆర్‍సీ కమిటీలకు ఫారెస్ట్ ​ఆఫీసర్లు సహకరించాలి
  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍

వరంగల్‍, వెలుగు: పోడు భూముల సమస్యలను పరిష్కరించే క్రమంలో గ్రామ కమిటీలు, అక్కడుండే అన్నీ రాజకీయ పార్టీలు తీర్మానం చేసి.. అడవులు, ఫారెస్ట్ భూముల జోలికి మళ్లీ పోమని రాసిస్తేనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు స్పష్టం చేశారు. గురువారం మంత్రి సత్యవతిరాథోడ్‍తో కలిసి హనుమకొండ కలెక్టరేట్​లో.. వరంగల్‍, హనుమకొండ జిల్లాల పరిధిలోని ‘పోడు వ్యవసాయ భూములు–జిల్లా స్థాయి సమన్వయ కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పోడు సమస్యలపై సీఎం కేసీఆర్‍ నాలుగేండ్లుగా స్టడీ చేస్తున్నారన్నారు.

పోడు భూముల్లో నిజంగా సాగు చేసుకునేవారికి మాత్రమే అవకాశమివ్వాలనేది సీఎం ఉద్దేశమన్నారు. ఈ సమస్యపై సెంట్రల్‍ గవర్నమెంట్‍ తీసుకొచ్చిన యాక్ట్ పనిచేయలేదన్నారు. అటవీ హక్కుల చట్టం–2005 ప్రకారం పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. పేదోళ్లకు న్యాయం చేసే క్రమంలో అధికారులు అనవసరపు అడ్డంకులు సృష్టించొదన్నారు. ఎఫ్‍ఆర్‍సీ గ్రామ కమిటీలకు ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు సపోర్ట్ చేయాలన్నారు. పేదోళ్లకు పట్టాలిచ్చి.. కావాలని కబ్జా చేసేవారు, భూములున్నవారిని దగ్గరకు రానివ్వకూడదని ఆదేశించారు. అధికారులు పోడు సమస్య ఉన్నచోట గ్రామసభలు పెట్టాలని.. లోకల్‍ ఎంపీపీలు, జడ్పీటీసీ వంటి ప్రజాప్రతినిధులను పిలవాలన్నారు. ఒక్కసారి పోడు పట్టాలు ఇచ్చామంటే.. భవిష్యత్తులో ఇక ఎవ్వరూ అడవుల జోలికి పోవొద్దన్నారు.

ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే సమస్యలు..

మీటింగ్​మంత్రి సత్యవతి రాథోడ్‍ మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను క్లియర్‍ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో140 జారీ చేసిందని.. ఎఫ్‍ఆర్‍సీ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పోడు పట్టాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ‘భూమి ఒకచోట.. పట్టా ఒకచోట.. రైతు మరోచోట’ ఉండే పరిస్థితిలు ఉన్నాయన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు దరఖాస్తుల పరిశీలనకు వెళ్లే క్రమంలో తేదీని.. ఎఫ్‍ఆర్‍సీ కమిటీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పోడు సాగు చేసుకునేవారికి ముందస్తు సమాచారం అందించాలని చెప్పారు. ప్రతి అప్లికేషన్‍ను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‍, హనుమకొండ జిల్లాల్లో ఉన్న పోడు సమస్యలో 90 శాతం తన నర్సంపేట నియోజకవర్గంలోనే ఉన్నట్లు చెప్పారు. ఆఫీసర్లు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో.. పోడు పట్టాలున్నా రైతులు కరెంట్‍, బోర్లు, రైతుబంధు, ఉపాధి హామీ పథకాలకు అర్హులు కాలేదన్నారు. రైతుల నివాసాలు ఓచోట, సాగు మరోచోట ఉండే అవకాశం ఉన్నందున అధికారులు కోఆర్డినేట్‍ చేసుకుని సరైన రీతిలో పట్టాలు ఇవ్వాలని సూచించారు. మీటింగ్‍లో వరంగల్‍ జడ్పీ చైర్‍పర్సన్‍  గండ్ర జ్యోతి, మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ గోపి, రాజీవ్‍గాంధీ హనుమంతు, ఐటీడీఓ పీఓ అంకిత్‍, సీపీ తరుణ్‍జోషి పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

హనుమకొండ సిటీ, వెలుగు: ఈ నెల 24న హనుమకొండ హరిత హోటల్​ లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి తొలి, మలి దశ ఉద్యమకారులంతా హాజరై విజయవంతం చేయాలని  కేయూ రిటైర్డ్​ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. హనుమకొండలో ఆయన మాట్లాఉడతూ..   60 ఏండ్ల ఉద్యమం,  దాదాపు 1500మందికి పైగా ఆత్మ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం  నిధులు, నీళ్లు, నియామకాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు, విద్యావేత్తలు పుల్లూరు సుధాకర్​, సోమ రామ్మూర్తి, డా.తిరునహరి శేషు, డా.చింతం ప్రవీణ్ పాల్గొన్నారు.

ఆశ్రమ పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

ములుగు, వెలుగు: గిరిజన ఆశ్రమ స్కూళ్లలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన తప్పవని హెచ్చరించారు. గురువారం గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్​నగర్​లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారో లేదో తెలుసుకున్నారు. స్కూల్​లో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్​టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ములుగు–వెలుగు యాప్​ లో అటెండెన్స్ నమోదు చేయాలని, లేకుంటే విధులకు గైర్హాజరైనట్లు పరిగణించి మెమో జారీ చేస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్ మన ఊరు–మన బడి పనులపై రివ్యూ చేశారు. వెంటనే వర్క్స్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. 

వర్క్స్ స్పీడప్  చేయాలి..

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో మోడల్ స్కూల్ అభివృద్ధి పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం  ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మోడల్ స్కూల్స్, ‘మన ఊరు– మన బడి’ కింద జరుగుతున్న పనులను తెలుసుకున్నారు. స్కూళ్లలో మేజర్, మైనర్ రిపేర్లతో పాటు మంచినీళ్లు, కరెంట్, టాయిలెట్లు, చికెన్ షెడ్ల పనుల్ని వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనుల్ని కలెక్టర్ పరిశీలించారు.

కాలువ కబ్జాపై కలెక్టర్ కు రిపోర్ట్
పోలీసులకు కంప్లయింట్

నర్సంపేట, వెలుగు:
వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్​లో కబ్జాకు గురైన పాకాల జాలుబంధం కాలువను కబ్జా చేసినట్లు ‘వెలుగు’లో కథనం రాగా ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు స్పందించారు. గురువారం ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈలు రమేశ్, యశ్వంత్, ఏఈఈ స్నేహిత, ఆర్ఐ రజాక్​లతో పాటు సిబ్బంది కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బోర్డును కూల్చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్​ఎస్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాకతీయులు నిర్మించిన జాలుబంధం కాలువ పాకాలకు మెయిన్​కెనాల్ అని అన్నారు. ఇది ముమ్మాటికీ ఇరిగేషన్ శాఖకు చెందిందేని, కాలువ చుట్టూ ట్రెంచ్​కొట్టిస్తామని స్పష్టం చేశారు. కబ్జాదారులపై మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు. కలెక్టర్ తోపాటు స్టేట్ ఆఫీసర్లకు దీనిపై రిపోర్ట్ ఇస్తామన్నారు.

కబ్జాపై ఎమ్మెల్యే నోరు విప్పాలి

జాలుబంధం కాలువ కబ్జాపై స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి నోరు విప్పాలని పీసీసీ మెంబర్​పెండెం రామానంద్​, కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ కన్వీనర్​ తక్కళ్లపల్లి రవీందర్​రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్​, టౌన్​ ప్రసిండెంట్​ బత్తిని రాజేందర్​లు డిమాండ్​ చేశారు. కబ్జాకు గురైన జాలుబంధం కాలువను గురువారం కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పరిశీలించారు. దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. కబ్జాదారులు కిరాయిగుండాలతో కలిసి ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. కబ్జాదారులను అరెస్ట్ చేయకుంటే కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్​ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌన్సిలర్లు వేముల సాంబయ్య, ఎలకంటి విజయ్ 
తదితరులున్నారు.

మేడారం వనదేవతలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన చీరల పంపిణీ

ఏటూరునాగారం, ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభమైంది. గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వన దేవతలకు, ములుగులోని గట్టమ్మ తల్లికి బతుకమ్మ చీరెలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు. మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, పీవో అంకిత్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తో కలిసి మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఈసారి 1.12లక్షల మందికి చీరెలు అందజేస్తున్నామన్నారు.

222 రేషన్ షాపుల ద్వారా వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. గోదావరి లోతట్టు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ఏటూరునాగారంలో ఐదు షెడ్లు నిర్మించామన్నారు. ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఆర్వో కె. రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది శ్రీదేవి, డీఆర్డీవో నాగ పద్మజ తదితరులున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో బతుకమ్మ చీరెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ మంజుల తెలిపారు. సర్పంచ్ మేడబోయిన అశోక్ తో కలిసి మహిళలకు చీరెలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజిత సమయం, జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్ తదితరులున్నారు.

మంత్రి పర్యటనలో ముఖ్య లీడర్లు గాయబ్?

మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా పర్యటనలో ముఖ్య నాయకులు కనిపించలేదు. ఇటీవలే మంత్రి కాన్వాయ్ కి అడ్డుతగిలిన టీఆర్ఎస్ ప్రతినిధులు.. గురువారం కూడా పర్యటనకు రాలేదు. దళితబంధు విషయంలో వీరంతా మంత్రి టూర్ ను బైకాట్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం జడ్పీ చైర్మన్​ కుసుమ జగదీశ్ మాత్రమే మంత్రి వెంట ఉన్నారు.

మహిళలందరికీ చీరెలు..

జనగామ అర్బన్: జనగామ జిల్లా వ్యాప్తంగా 2.09లక్షల మందికి బతుకమ్మ చీరెలు అందజేయనున్నట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ నెల 24లోగా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క మహిళకు అందేలా చూడాలన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ

హసన్ పర్తి: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​అన్నారు. బుధవారం హసన్ పర్తి మండలం బైరాన్ పల్లి, సిద్దాపూర్, హరిచంద్రు నాయక్ తండా, అర్వపల్లి, మల్లారెడ్డి పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బతుకమ్మ చీరెలు, కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, సీసీ రోడ్లను ప్రారంభించారు. మహిళలందరికీ చీరెలు ఇస్తామన్నారు.

కేసీఆర్ ను మరోసారి దీవించాలి

మొగుళ్లపల్లి, వెలుగు: అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ను ప్రజలు మర్చిపోవద్దని, మరోసారి అధికారంలోకి వచ్చేలా దీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లు, మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జడ్పీటీసీ సదయ్య, ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ నర్సింగరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి రావు, సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ అన్నారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాములు, సర్పంచులు ధర్మారావు,యుగంధర్, రమాదేవి, ప్రభాకర్ రెడ్డి, అరవింద్, శ్రీనివాస్, తిరుపతి, ఎంపీటీసీలు వనితా పూర్ణచందర్, వెంకటేశ్వర్ రెడ్డి, బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, నరహరి వెంకట్ రెడ్డి, యువరాజు, రామారావు, మహిపాల్, బొచ్చు శ్రీనివాస్ తదితరులున్నారు.

ముల్కనూర్ డైరీ మహిళా సభ్యులకు బంపర్ ఆఫర్
దసరా కానుకగా రూ.12కోట్ల బోనస్

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ మహిళా స్వకృషి డైరీ సభ్యులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా కానుకగా రూ.12కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు జీఎం భాస్కర్ రెడ్డి తెలిపారు. డైరీ పరిధిలోని సభ్యులకు తమ సొంత అకౌంట్లో ఇవి జమ అవుతాయన్నారు. పడిన వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఖాతా చెక్ చేసుకోవాలన్నారు.

ఉత్సవాలపై ఎమ్మెల్యే పెత్తనమేంది?

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ లో కులమతాలకు అతీతంగా వివిధ కమిటీలు ఏండ్ల నుంచి బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. తూర్పు ఎమ్మెల్యే వాటిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విమర్శించారు. గురువారం వరంగల్ ఓసిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఐక్యంగా ఉండి ఉత్సవాలు చేసుకుంటుంటే, వారిని ఎమ్మెల్యే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తన వర్గంతో ఆయా కమిటీలపై అభియోగాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. అతిథిగా పాల్గొనాల్సిన ఎమ్మెల్యే.. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.

ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్​భాస్కర్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. భద్రకాళి, పద్మాక్షమ్మ, బంధం చెరువు తదితర ప్రాంతాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. దసరా ఉత్సవాలకు పద్మాక్షమ్మగుట్టను సిద్ధం చేయాలన్నారు. భద్రకాళి అమ్మవారి ఊరేగింపునకు పోలీసుల బందోబస్తు నిర్వహించాలన్నారు. రివ్యూ మీటింగ్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,హనుమకొండ ఏసీపీ కిరణ్​ కుమార్ పాల్గొన్నారు.

ఉత్సవాలపై ఎమ్మెల్యే పెత్తనమేంది?

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ లో కులమతాలకు అతీతంగా వివిధ కమిటీలు ఏండ్ల నుంచి బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. తూర్పు ఎమ్మెల్యే వాటిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విమర్శించారు. గురువారం వరంగల్ ఓసిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఐక్యంగా ఉండి ఉత్సవాలు చేసుకుంటుంటే, వారిని ఎమ్మెల్యే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తన వర్గంతో ఆయా కమిటీలపై అభియోగాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. అతిథిగా పాల్గొనాల్సిన ఎమ్మెల్యే.. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.

ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్​భాస్కర్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. భద్రకాళి, పద్మాక్షమ్మ, బంధం చెరువు తదితర ప్రాంతాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. దసరా ఉత్సవాలకు పద్మాక్షమ్మగుట్టను సిద్ధం చేయాలన్నారు. భద్రకాళి అమ్మవారి ఊరేగింపునకు పోలీసుల బందోబస్తు నిర్వహించాలన్నారు. రివ్యూ మీటింగ్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,హనుమకొండ ఏసీపీ కిరణ్​ కుమార్ పాల్గొన్నారు.

మావోయిస్టులకు సహకరించొద్దు

చిట్యాల, వెలుగు: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని సీఐ పులి వెంకట్​ కోరారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామిలో  చిట్యాల, టేకుమట్ల ఎస్సైలు గుర్రం కృష్ణప్రసాద్​, చల్ల రాజుల ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ వెంకట్​ హాజరై మాట్లాడుతూ గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్తవ్యక్తులు గ్రామంలోకి వస్తే వెంటనే సమాచారం అందించాలని అన్నారు.

క్షుద్ర పూజల కలకలం

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో ఓ ఇంటి ముందు చేసిన క్షుద్ర పూజలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో వడ్లకొండ మధునక్క ఇంటి ముందు ఉదయం లేచి చూసే సరికి క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. తాము కొనుగోలు చేసిన స్థలం విషయంలో గొడవలు జరిగాయని, గిట్టని వారే ఈ పని చేశారని మధునక్క వాపోయింది. సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యే కబ్జాలు బయటపెడతం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూకబ్జాలు, సెటిల్ మెంట్లు త్వరలోనే బయటపెడతామని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్​నాయక్​అన్నారు. గురువారం ప్రజాగోస–బీజేపీ భరోసా ప్రోగ్రాంలో భాగంగా మహబూబాబాద్​మండలం అయోధ్య, ముడుపుగల్లు, అమనగల్లు, సింగారం, వీఎస్​లక్ష్మిపురం, జంగిలిగొండ, పర్వతగిరి గ్రామాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో పలువురు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే ఆయన చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఒద్దిరాజు రాంచందర్​రావు, యాప సీతయ్య, ఎర్రంరెడ్డి సిద్ధార్ధ్​ రెడ్డి, మొసంగి మురళీ తదితరులున్నారు.