వడ్ల పైసలు అందుతలేవ్

వడ్ల పైసలు అందుతలేవ్

‘‘వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం’’సివిల్​ సప్లయిస్ డిపార్ట్​మెంట్​ అధికారుల ప్రకటన ఇది. కానీ వాస్తవానికి రాష్ట్రంలో వేలాది మంది రైతులు వడ్ల పైసల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల 20 రోజులు దాటినా డబ్బులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లకు కేటాయింపులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో లారీలు ఐకేపీ సెంటర్లకు రావడం లేదు. వడ్లు ఐకేపీ సెంటర్లలోనే ఉండిపోతుండటంతో రైతులకు పైసలు అందడం లేదు.

రాష్ట్రంలో 3,547 కొనుగోలు కేంద్రాల్లో ఖరీఫ్‌కు సంబందించి వడ్లను కొంటున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు నిర్వహించే ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రైతులు వడ్లు తీసుకొచ్చిన తర్వాత పట్టదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ట్యాబ్‌ల్లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత వడ్లను కాంటా పెడతారు. ఐకేపీ సెంటర్లకు లారీలు వచ్చి ధాన్యం లోడ్‌ చేసుకుని రైస్‌ మిల్‌కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ఓకే చేసిన తర్వాత ఒక రైతుకు సంబంధించి ఎన్ని వడ్లు కొన్నాం.. ఎన్ని పైసలు ఇవ్వాలో అధికారులు ఫైనల్​ చేస్తారు. రోజువారీగా విడుదల చేసే డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియకు వారంపైగా పడుతోంది. గతంలో ఫిర్యాదులు రావడంతో రైతులకు 48 గంటల్లో డబ్బులు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే మిల్లర్లకు వడ్ల కేటాయింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం ఐకేపీ సెంటర్లకు లారీలు రావడం లేదు. రోజుల తరబడి ఐకేపీ సెంటర్లలోనే వడ్లు ఉండిపోతున్నాయి. వడ్లు కాంటా అయిన పది నుంచి 25 రోజుల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

కొన్ని రకాల వడ్లు కొంటలేరు

మరోవైపు 1070, 1010, 1262, జెమిని తదితర రకాల వడ్లను ఐకేపీ సెంటర్లలో కొనడం లేదు. పై నుంచి ఆదేశాలు లేవని, అందుకే కొనుగోలు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. వందల ఎకరాల్లో వేల క్వింటాళ్లు పండించిన రైతులు రోజుల తరబడి ఐకేపీ సెంటర్లలోనే వడ్లను రాసులు పోసి ఎప్పుడు కొంటారా? అని ఎదురుచూస్తున్నారు.