ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు సోమవారం (అక్టోబర్ 21) రాత్రి చిత్తూరు నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.