
కుభీరు, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు తగిలి షాక్‌కు గురై తండ్రీకొడుకులు చనిపోయారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోసి గ్రామానికి చెందిన రైతు రాములు(52), ఆయన కొడుకు మురళి(26).. బుధవారం పొలం పనులకు వెళ్లారు. సోయా పంట రక్షణ కోసం అమర్చిన కరెంట్ తీగలకు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే ఇద్దరూ చనిపోయారు. తండ్రీకొడుకులిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి చూడగా.. ఇద్దరు మృతి చెంది కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తానూర్ ఎస్సై రాజన్న తో పాటు తహసీల్దార్ శ్యాంసుందర్ స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.