పంజాగుట్ట పరిధి లోని బాల్కనీ కూలి తండ్రీ కొడుకు మృతి

పంజాగుట్ట పరిధి లోని బాల్కనీ కూలి తండ్రీ కొడుకు మృతి
  •     హైదరాబాద్ పంజాగుట్టలో ఘటన
  •     పాత బిల్డింగ్ కావడంతోనే ప్రమాదం 

పంజాగుట్ట, వెలుగు: బాల్కనీ కూలి తండ్రీకొడుకు మృతి చెందిన ఘటన హైదరాబాద్​ పంజాగుట్ట పరిధిలోని కుందన్‌‌‌‌బాగ్‌‌‌‌లో జరిగింది. బాలానగర్‌‌‌‌కు చెందిన దేవదాసు (56) హౌస్ వైరింగ్ పనులు చేస్తుంటాడు. కుందన్‌‌‌‌బాగ్‌‌‌‌లోని శ్రీవస్థ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో నివసిస్తున్న ద్వారకా ప్రసాద్ తన ఇంట్లో రిపేర్ల కోసం శనివారం ఉదయం దేవదాసును పిలిపించాడు. దీంతో దేవదాసు తన కుమారుడు వివేక్ (30)తో కలిసి అక్కడికి వెళ్లాడు. మూడో అంతస్తులో ముగ్గురు మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా బాల్కనీ కూలింది. 

ఈ ప్రమాదంలో దేవదాసు, వివేక్ అక్కడికక్కడే మృతి చెందగా, ద్వారకా ప్రసాద్ గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన ప్రసాద్‌‌‌‌ను సమీప ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. ప్రాథమిక విచారణలో భవనం పాతది కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.