నాన్న పిలిచిండని భయపడుతూనే వెళ్లి..

నాన్న పిలిచిండని భయపడుతూనే వెళ్లి..
  • టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో  చనిపోయిన కొడుకు

వాషింగ్టన్: ‘నాకు భయం నాన్నా.. నేను రాను’ అన్నా నచ్చచెప్పి తీసుకెళ్లిండా తండ్రి.. కొడుకు భయపడ్డట్లే ప్రమాదం జరిగి ఇద్దరూ చనిపోయారు. టైటాన్ జలాంతర్గామిలో వెళ్లి చనిపోయిన తండ్రీకొడుకుల విషాదమిది. సముద్ర గర్భంలోకి ప్రయాణం చేసొద్దామని తండ్రి షహజాదా దావూద్(48) చెప్పినప్పుడు సులేమాన్ దావూద్(19) భయపడ్డాడట. తండ్రి పదే పదే పిలవడం, యాత్ర చేపట్టే రోజు సెలవు రోజు కావడం.. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఫాదర్స్ డే కావడంతో సులేమాన్ చివరకు రాజీ పడ్డాడట. భయం భయంగానే ఒప్పుకున్నాడని సులేమాన్ మేనత్త అజ్మీ దావూద్ చెప్పారు. టైటాన్ ప్రమాదంలో టూరిస్టులు అందరూ చనిపోయారని అధికారికంగా ప్రకటించిన తర్వాత అజ్మీ దావద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. షహజాదా దావూద్​ ఈ ప్రయాణం కోసం ఉత్సాహంగా ఎదురుచూడగా.. సులేమాన్ మాత్రం ఆందోళనగానే వెళ్లాడని తెలిపారు. చివరకు ఇలా ప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని విలపించారు.

2019లో విమాన ప్రమాదం..

పాకిస్తాన్ లో పేరొందిన వ్యాపార కుటుంబానికి చెందిన షహజాదా దావూద్ కుటుంబంతో కలిసి బ్రిటన్ లో స్థిరపడ్డారు. 2019లో షహజాదా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవగా.. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. అదొక భయంకరమైన అనుభవమని షహజాదా భార్య క్రిస్టీన్ దావూద్  తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ‘‘2019లో మేము ప్రయాణించాల్సిన విమానం ఆఖరి నిమిషంలో రద్దయింది. అప్పుడు ఇంటికి తిరిగి వెళ్లిపోతే బాగుండేది. కానీ మేము ప్రయాణం కొనసాగించేందుకే నిర్ణయించుకున్నాం. ఎయిర్ లైన్స్ సంస్థ ఏర్పాటు చేసిన మరో విమానంలో బయల్దేరాం. కాసేపటికే విమానం కుదుపులకు లోనవడం మొదలైంది. భారీ కుదుపులకు లోనవడంతో  ప్రయాణికులు కొందరు ఏడుస్తున్నారు. విపరీతమైన గాలులు వీస్తుండడంతో ల్యాండ్ చేయడం కుదరడంలేదని, మరో యాంగిల్​ లో ప్రయత్నిస్తానని పైలట్​ చెప్పాడు. ఈ ప్రయత్నంలో  పైలట్ సక్సెస్ అయ్యాడు. విమానాన్ని క్షేమంగా నేలపై దించాడు. దీంతో చావు అంచులదాకా వెళ్లి బతికొచ్చినట్లు అనిపించింది” అని క్రిస్టీనా తన బ్లాగ్ లో పేర్కొన్నారు.