
తనకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురుని ఓ తండ్రి కోర్టు ముందే కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో జరిగింది. రోహ్తక్ జిల్లాకు చెందిన పూజా, మోహిత్‌లు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ జాట్ వర్గానికి చెందినవారు. అయితే వీరి పెళ్లికి పూజా తండ్రి కుల్దీప్ ఒప్పుకోలేదు. దాంతో పూజా, మోహిత్‌లు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోహిత్ కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోవడంతో.. వీరిద్దరూ మోహిత్ ఇంటికి వెళ్లారు. అయితే పూజా తండ్రి మాత్రం తన కూతురును బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని మోహిత్, అతని కుటుంబసభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కాగా.. కుల్దీప్ పెట్టిన కేసు కోర్టులో హియరింగ్‌కు రావడంతో.. మోహిత్ కుటుంబసభ్యులు కొత్త జంటతో కలిసి కోర్టుకు బయలుదేరారు. అది తెలుసుకున్న కుల్దీప్.. రోహ్తక్ బైపాస్ రోడ్డు సమీపంలోని కోర్టు ఆవరణకు మోహిత్ కుటుంబసభ్యుల వాహనం సమీపించగానే కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూజా మరియు మోహిత్ సోదరుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. మోహిత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక పీజీఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మోహిత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
‘కొత్తజంటను ఆశీర్వదించడానికి కలుస్తానని నమ్మించిన కుల్దీప్.. దగ్గరకు రాగానే వారిపై కాల్పులు జరిపాడు. కుల్దీప్ ముందు పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నమ్మించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పులు జరిపిన తర్వాత కుల్దీప్.. అక్కడి నుంచి పారిపోయాడు’ అని మోహిత్ తల్లి తెలిపారు.
‘ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నాం’ అని సీనియర్ పోలీసు అధికారి సజ్జన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే కేసుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని.. వారిని డిసెంబర్ 31, గురువారం కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.
For More News..
కొడుకుల మీద కోపంతో కుక్క పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్
సాగర్ టీఆర్ఎస్లో లోకల్-నాన్‌లోకల్ రగడ
కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?