ట్రంప్ మాజీ సలహాదారు ఇంట్లో ఎఫ్బీఐ సోదాలు.. భారత్పై టారిఫ్లను తప్పుబట్టడమే కారణమా?

ట్రంప్ మాజీ సలహాదారు ఇంట్లో ఎఫ్బీఐ సోదాలు.. భారత్పై టారిఫ్లను తప్పుబట్టడమే కారణమా?

వాషింగ్టన్: టారిఫ్​లపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్ మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బొల్టన్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకే మేరీల్యాండ్‌‌లోని బెథెస్డాలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్న ఎఫ్​బీఐ అధికారులు.. సోదాలు ప్రారంభించారు. ‘జాతీయ భద్రతా దర్యాప్తు’లో భాగంగానే సోదాలు చేశామని అధికారులు మీడియాకు వెల్లడించారు. 

‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ అంటూ ఎఫ్​బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఎక్స్​లో పోస్టు పెట్టారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవంటూ బొల్టన్ తరుచూ విమర్శిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్​ ఇదంతా చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ట్రంప్  విధించిన టారిఫ్​లు, ఫారిన్ పాలసీలపై బొల్టన్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎఫ్​బీఐ సోదాలు.. రాజకీయ కక్షపూరితమైనవని పలువురు విమర్శిస్తున్నారు. 

ట్రంప్ మొదటి పాలనలో జాన్ బొల్టన్ 17 నెలల పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్​గా పనిచేశారు. కాగా, క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు కలిగి ఉన్నారన్న అనుమానంతోనే బొల్టన్ ఇంట్లో సోదాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఎఫ్​బీఐ సోదాలు చేస్తున్న టైమ్​లో బొల్టన్ ఇంట్లోనే ఉన్నారు. గతంలో బైడెన్ పాలనలో రాజకీయ కారణాలతో ఆగిపోయిన దర్యాప్తును ట్రంప్ పునరుద్ధరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 2020లో బొల్టన్ రిలీజ్ చేసిన ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్’ బుక్​లో కీలక సమాచారం వెల్లడించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.