భూమి పోతుందనే బెంగ.. గుండెపోటుతో రైతు మృతి

భూమి పోతుందనే బెంగ..  గుండెపోటుతో రైతు మృతి

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: తన పట్టా భూమిని ఎక్కడ ఆఫీసర్లు తీసుకుంటారోనని బెంగతో  మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రైతు  డాక్ గారి నారాయణ (65) బుధవారం రాత్రి గుండె పోటుతో చనిపోయాడు. ఈ నేపథ్యంలో రైతులు గురువారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు. పెద్దశంకరంపేట - రేగోడ్ రోడ్ లోని మైసమ్మ గుడి దగ్గరలోని సర్వే నెంబర్  271 లో 5 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో రెవెన్యూ ఆఫీసర్లు హెచ్ఎండీఏ కు అప్పగించారు.  

సంబంధిత ఆఫీసర్లు  మూడు నెలల కింద ఆ  భూమిని తమ అధీనంలోకి తీసుకుంటున్నట్టు అక్కడ బోర్డులు పాతారు. నాలుగు రోజుల కింద నారాయణకు పిల్లల ద్వారా భూమి విషయం తెలిసింది. అప్పటి నుంచి నారాయణకు తన స్థలం ఎక్కడ పోతుందో అన్న బెంగ పట్టుకుంది. ఈ క్రమంలోనే నారాయణకు గుండె పోటు వచ్చి చనిపోయాడని గ్రామస్తులు ఆరోపించారు. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు తమ భూములు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ గ్రేసీబాయికి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆమె పట్టా భూములు ఎవరివీ తీసుకోరని, ప్రభుత్వ భూమిని మాత్రమే వారికి కేటాయించామని స్పష్టం చేశారు.  పట్టా భూములు ఉన్న రైతులు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.