- నెల గడిచినా బయటకు రాని ఫీజు చట్టం డ్రాఫ్ట్ కాపీ
- ఊసే లేని ప్రజాభిప్రాయ సేకరణ
- బేస్ ఫీజుపై వీడని స్పష్టత.. డేటా సేకరణలో జాప్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని సర్కారు చెబుతున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. మరో రెండు నెలల్లోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ ఏడాదీ ఫీజుల నియంత్రణ కష్టమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 11వేల ప్రైవేటు స్కూళ్లున్నాయి. వీటిలో ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉంది. అయితే, గత ప్రభుత్వం కొంత హడావుడి చేసినా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మరోసారి ఈ ఫీజుల అంశం తెరమీదికి వచ్చింది. అటు తెలంగాణ విద్యా కమిషన్ తోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఫీజుల నియంత్రణపై సర్కారుకు ప్రతిపాదనలు ఇచ్చారు.
దీని ప్రకారం ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్లు.. ప్రతి రెండేండ్లకోసారి కేవలం 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అనుమతి తీసుకోవాలని దానిలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆ ఫీజుల ప్రతిపాదనలపై సమీక్షించారు. ఫీజుల నియంత్రణ చట్టం డ్రాఫ్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టి.. అందరి నుంచి సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది జరిగి నెలరోజులు గడిచినా అధికారులు ఇప్పటికీ డ్రాఫ్ట్ ను మాత్రం వెబ్ సైట్ లో పెట్టలేదు.
బేస్ ఫీజు లెక్కేది?
ఫీజులను అదుపు చేయాలంటే ముందుగా స్కూల్ బేస్ ఫీజును ఖరారు చేయాలి. స్కూళ్ల నిర్వహణ ఖర్చులు, టీచర్ల జీతాలు, గత మూడేండ్ల ఆడిట్ రిపోర్టుల ఆధారంగా దీన్ని నిర్ణయించాలని అధికారులు ప్రాథమికంగా అనుకున్నారు. దీనికి గానూ ఎంఈఓలు, డీఈఓల ద్వారా స్కూళ్ల నుంచి డేటా సేకరించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకూ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు.
ఈ క్రమంలోనే ప్రైవేటు మేనేజ్మెంట్లు వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పుడే ఫీజులు పెంచేశాయి. దీనికితోడు యూనిఫామ్, బుక్స్ కోసమంటూ వసూళ్లూ మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ పెంచిన ఫీజులనే బేస్ ఫీజులుగా తీసుకుంటే తమకు ఎలాంటి లాభం ఉండదని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
అధికారుల తీరుతో పేరెంట్లలో నిరాశ..
ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశించిన పేరెంట్స్‌కు అధికారుల తీరు నిరాశ కలిగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు కావాలనే కాలయాపన చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ మేనేజ్మెంట్లకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫీజుల నియంత్రణ చట్టం డ్రాఫ్ట్ ను.. అడ్వకేట్ జనరల్ ఆమోదం కోసం పంపించారని, ఇటీవల దానికి ఆమోదం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం దాన్ని లా డిపార్ట్ మెంట్ కు పంపిస్తారని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు వెంటనే ఈ ఫీజుల అంశంలో జోక్యం చేసుకొని.. యుద్ధ ప్రాతిపదికన ఫీజు నియంత్రణ ప్రక్రియను పూర్తి చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
