- ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ఆగస్టు 15లోగా చెల్లిస్తాం.. హైకోర్టుకు ప్రభుత్వం హామీ
- జీవో–9లోని గైడ్‌లైన్స్‌పై స్టే ఎత్తివేసిన కోర్టు
- కొత్త స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు
- చేయొద్దని యాజమాన్యాలకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను గడువులోగా చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన జీవో నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. తొలి ఏడాది విద్యార్థుల ఫీజులను ఆగస్టు 15లోగా, ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల ఫీజులను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఈమేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ను సవాల్ చేస్తూ వందకు పైగా ప్రైవేటు కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ జీవో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు గత నెల జీవో–9లోని నాలుగు పేరాల అమలుపై స్టే ఇచ్చింది. కానీ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం ఆ స్టే ఉత్తర్వులను తాత్కాలికంగా నిలివేసింది. ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కాలేజీలను ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేసి జూలై 31లోగా ఆయా విద్యార్థుల ఫీజులను చెల్లించాలంది. తొలి ఏడాది విద్యార్థుల ఫీజుల తొలి విడతను ఆగస్టు 15లోగా విడుదల చేయాలని సూచించింది. ఆ గడువు ముగిసిన తర్వాత మాత్రమే అవసరమైతే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గతంలో విధించిన స్టే ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ప్రభుత్వ వాదన ఇదీ..
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురామ్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రూ.250 కోట్ల విడుదల కేవలం కొత్త అడ్మిషన్లకే కాకుండా అన్ని సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపుల ప్రక్రియలో భాగ మన్నారు. తొలి విడత నిధులు విడుదల చేస్తున్నామని, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 15లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్లు ఇవ్వబోమని కాలేజీలు చెబితే పేద విద్యార్థుల భవిష్యత్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు కూడా ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
కాలేజీల వాదన ఇలా..
కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, ఎల్. రవిచందర్, అవినాశ్ దేశాయ్ వాదించారు. ప్రభుత్వంపై విశ్వాసం కలగడంలేదని, గత కొన్నేళ్లుగా వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదని వాదించారు. చదువు పూర్తిచేసి కాలేజీలను విడిచి వెళ్లిన విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు ఎలా వసూలు చేయగలవని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సారి కొత్త జీవోలు తీసుకొస్తూ కాలం గడుపుతోందని, దీని వల్ల ఫీజులు కాలేజీలకు అందడం లేదని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. జీవో–7, జీవో–8, జీవో–9లపై వరుసగా వివాదాలు తలెత్తాయని, స్టే ఎత్తివేస్తే కనీసం ఆగస్టు 19 వరకు గడువు ఇచ్చి, ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆగస్టు 20 నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
