మజ్లిస్‌‌‌‌ మాదిరిగానే కేంద్రంలో బీజేపీ ఓట్ల చోరీ

మజ్లిస్‌‌‌‌ మాదిరిగానే కేంద్రంలో  బీజేపీ ఓట్ల చోరీ
  •  కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ఓట్ల చోరీ విషయంలో కొన్నేండ్లుగా హైదరాబాద్‌‌‌‌లో మజ్లిస్ చేస్తున్న పనే.. ఇప్పుడు దేశంలో బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ నేత, నాంపల్లి సెగ్మెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తడం సంతోషంగా ఉందని, ఇది ఎలక్ట్రోరల్ ఫ్రాడ్ అని, ప్రజాస్వామ్యానికే పెద్ద అవమానమని అన్నారు. ఈ అంశం పొలిటికల్ ఫైట్ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధమని చెప్పారు. 

దొంగ ఓట్లను అరికట్టాల్సిందేనని అన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ఓట్లన్ని దారు సలామ్‌‌‌‌లో తయారవుతున్నాయని ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గంలో డూప్లికేట్ గుర్తింపు కార్డులతో కొత్త ఓట్లు సృష్టించారని, ఎన్నికలప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నవాళ్లను తాము పట్టుకున్నప్పటికీ ఎన్నికల సంఘం పట్టించుకోలేదని గుర్తుచేశారు. బురఖా వేసుకొని ఓట్లు వేయడంతోనే మోసం జరుగుతోందని, ఆ కారణంగానే తాను గత ఎన్నికల్లో 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు.

 బీజేపీకి బీ టీమ్ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ అని, ఓల్డ్ సిటీని చెత్త బుట్ట చేసిన అసద్‌‌‌‌కు త్వరలోనే కేంద్రం బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఇస్తుందని ఎద్దేవా చేశారు.  బీజేపీ, మజ్లిస్ రెండూ ఒకే నాణానికి బొమ్మ బొరుసు అని అన్నారు. మజ్లిస్‌‌‌‌కు ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవాలని ఫిరోజ్ ఖాన్ సవాల్ చేశారు.