రుణమాఫీతో రైతుల ఇండ్లల్లో పండుగ: సీఎం రేవంత్

రుణమాఫీతో రైతుల ఇండ్లల్లో పండుగ: సీఎం రేవంత్
  • కేవలం 12 రోజుల్లో రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ
  • ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ   
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాకట్టు పెట్టింది
  • వాళ్లు చేసిన అప్పుల కిస్తీలకు 8 నెలల్లోనే 
  • రూ.43 వేల కోట్లు కట్టినమని వెల్లడి 
  • రూ.లక్షన్నర లోపు రుణాల మాఫీకి నిధులు విడుదల 
  • మొత్తం 6.40 లక్షల మందికి రూ.6,190 కోట్లు రిలీజ్ 
  • అన్నదాతల ఆనందంతో నా జన్మధన్యమైంది
  • రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం


హైదరాబాద్, వెలుగు: రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీలకు రైతులు గుర్తుకువస్తారు. కానీ ఇప్పుడేం ఎన్నికల్లేవ్. అయినా మేం ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం. కేవలం 12 రోజుల్లోనే రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినం. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం” అని చెప్పారు. 

రుణ విముక్తి పొందిన లక్షలాది మంది రైతులు తమ ఇండ్లల్లో పండుగ చేసుకుంటున్నారని, దీంతో తన జన్మధన్యమైందని అన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీలో భాగంగా రూ.లక్షన్నర లోపు రుణాల మాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 


ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,198 కోట్లు జమ చేస్తున్నామని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి మా ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. 

స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతగా జులై 18న రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినం. మొత్తం 11 లక్షల మంది రైతులకు రూ.6,098 కోట్లు మాఫీ అయ్యాయి. ఇప్పుడు రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నం. మొత్తం 6.40 లక్షల మందికి రూ.6,190 కోట్లు మాఫీ చేస్తున్నం. 

అంటే కేవలం 12 రోజుల్లోనే రూ.12 వేల కోట్లకు పైగా రైతుల రుణ ఖాతాల్లో జమ చేశాం” అని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అధికారులకు అభినందనలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలను మాఫీ చేస్తున్నం. దేశానికి స్వాత్యంత్ర్యం వచ్చిన ఆగస్టులో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి, రైతులను రుణ విముక్తులను చేస్తాం” సీఎం రేవంత్ వెల్లడించారు. 

వ్యవసాయం దండుగ కాదు.. పండుగ 

రైతులు ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ అన్నారు. ‘‘వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తామని 2022 మే 6న వరంగల్ లో రైతు డిక్లరేషన్ ను ప్రకటించాం. ఇచ్చిన మాట ప్రకారం రైతులు సంతోషంగా ఉండాలని అధికారం చేపట్టిన 8 నెలల్లోనే రుణమాఫీ అమలు చేస్తున్నం. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని మోసం చేశాయి. 

గడిచిన పదేండ్లలో బ్యాంకులకు దాదాపు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయి. కానీ సాగు కోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న రైతులు.. వాటిని తిరిగి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. పది మందికి అన్నం పెట్టే రైతులు.. పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక, అప్పులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆత్మగౌరవం దెబ్బతిని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలు కూడా జరిగాయి. అందుకే రైతుల కుటుంబాల్లో ఆనందం నింపాలని రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నం” అని తెలిపారు.  

కాంగ్రెస్.. రైతు పక్షపాతి

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చారని సీఎం రేవంత్ అన్నారు. ‘‘జై జవాన్, జై కిసాన్ నినాదాలతో దేశ భద్రత, ఆహార భద్రతకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రైతులకు మేలు చేసేందుకు భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకు ప్రాజెక్టులు నిర్మించింది. పేద రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయీకరణ చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చింది. రూ.72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, రైతులను ఆదుకుంది. 

విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్తు, పంటల బీమా, మద్దతు ధరలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతి” అని అన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి తమ చిత్తశుద్ధి చాటుకున్నామని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, మిగతా మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

బీఆర్ఎస్ రుణమాఫీని ఎగ్గొట్టింది..  

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు నాలుగు విడతల్లో రుణాలు మాఫీ చేసింది. దీంతో రైతులు తమ అప్పుకు మించి మిత్తీలు కట్టాల్సి వచ్చింది. ఇక రెండోసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. రూ.19 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, రూ.12 వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. 

దాదాపు రూ.7 వేల కోట్ల రుణాలు మాఫీ చేయలేదు” అని మండిపడ్డారు. ‘‘అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేస్తారని కొందరు అవహేళన చేశారు.. శాపనార్థాలు పెట్టారు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమీకరించింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం” అని అన్నారు. ‘‘గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి, రుణాల భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నం. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం ఈ 8 నెలల్లోనే రూ.43 వేల కోట్ల కిస్తీలు చెల్లించింది” అని చెప్పారు.