హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ సరఫరా, వాటిని విక్రయించే నిందితులను కఠినంగా శిక్షించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. శుక్రవారం ఈ అంశంపై సీఎంకు లేఖ రాశారు. డ్రగ్స్ నిందితులపై కేసులు నమోదు చేస్తున్నా సమగ్రంగా విచారణ జరగడం లేదని ఆరోపించారు. 2017లో మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ సరఫరా చేయడం, వినియోగిస్తుండటంపై కేసులు నమోదు చేశారని, ఇందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
అయితే, అప్పటి ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిందన్నారు. ఈ కేసులో 62 మందిని నిందితులుగా చేర్చగా 12 కేసులు నమోదు చేశారని, కోర్టుల్లో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారన్నారు. డ్రగ్స్ కేసుల్లో నేరాన్ని రుజువు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని, దీంతో పలు కేసులను కొట్టివేస్తూ, నిందితులను కోర్టులు విడుదల చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.
