హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలతో పోలీసుల సంబంధాలు మెరుగుపరచడంతోపాటు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని డీజీపీ శివధర్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ప్రతినిధులు కోరారు. మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డిని ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి, ఉపకార్యదర్శి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు వివేక్, మహ్మద్ రఫీ మర్యాద పూర్వకంగా కలిశారు.
పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించారు. జిల్లా, మండల స్థాయిల్లోని కొన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులకు సరైన స్పందన ఇవ్వడం లేదని, జిల్లా స్థాయిలో పోలీస్ కంప్లయింట్స్ అథారిటీలను ఏర్పాటు చేయాలని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డీజీపీ.. పోలీసుల ప్రవర్తనపై ఏమైనా సమస్యలుంటే కొత్తగా ఏర్పాటైన పోలీస్ కంప్లయింట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
