
- అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నట్టు సమాచారం. ఈ నియామకాలతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖలో సుమారు 8,000 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం మరో 7,000 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా 1,623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుండటంతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.