ఫారెస్ట్ అధికారులు పంటలు ధ్వంసం చేస్తున్నరు

ఫారెస్ట్ అధికారులు పంటలు ధ్వంసం చేస్తున్నరు

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గుంపులో పోడు సాగుదారులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. రెండు రోజులుగా అధికారులు పోడు భూములలోకి వెళ్లకుండా సాగుదారులను అడ్డుకుంటున్నారు. శుక్రవారం పోడు భూములను దున్నుతున్న గిరిజనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలతో దురుసుగా ప్రవర్తించారంటూ గిరిజనులు ఘర్షణకు దిగారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. గిరిజనులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఫారెస్ట్ అధికారులు వెనక్కి తగ్గారు. శనివారం ఆదివాసీ నాయకులు రంగంలోకి దిగి ప్రభుత్వ జీవో నంబర్ 140 కోర్టులో ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు సమన్వయం పాటించాలని అన్నారు.

అక్టోబర్ నెలలో వచ్చే తీర్పును బట్టి ఆలోచన చేద్దామని, వేచి చూద్దామని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. దీంతో కొందరు ఆదివాసీలు శాంతించారు. ఫారెస్ట్ అధికారులు కూడా పోడు భూముల వద్ద నుంచి వెళ్లిపోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. భూములు లేని పేద గిరిజనులమని, ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు తమపై అన్యాయంగా దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను వదిలే ప్రసక్తే లేదని, తమపై ఎన్ని కేసులు పెట్టి జైళ్లకు పంపించినా..  తిరిగి వచ్చి మళ్లీ వ్యవసాయమే చేస్తామని చెప్పారు.