కీవ్​ వీధుల్లో భీకర పోరు

కీవ్​ వీధుల్లో భీకర పోరు
  • పోలాండ్ బార్డర్ వద్దకే 1.16 లక్షల రెఫ్యూజీలు
  • హంగేరి, రుమేనియా, మాల్డోవాకూ జనం క్యూ 
  • కీవ్​లోకి గ్రూపులుగా రష్యన్ సోల్జర్లు
  • ఇండ్లు, అపార్ట్ మెంట్​లపైనా మిసైల్ దాడులు
  • కీవ్​లోనే ఉన్నా.. లొంగే ప్రసక్తే లేదు: జెలెన్​ స్కీ

కీవ్​: రష్యా దాడులతో ఉక్రెయిన్ జనం వణికిపోతున్నరు. ఏ క్షణం ఏ బాంబు వచ్చి మీద పడ్తదోనని భయంభయంగా బతుకుతున్నరు. ఇండ్లను వదిలి బంకర్లు, అండర్ గ్రౌండ్ షెల్టర్లలో తలదాచుకుంటున్నరు. చివరకు బతికుంటే చాలు దేవుడా.. అనుకుంటూ లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని, పిల్లాపాపలను తీస్కుని పక్కదేశాలకు వలసపోతున్నరు. పోలాండ్, మాల్డోవా, హంగేరీ, రుమేనియా, స్లొవేకియా దేశాలకు ఇప్పటికే 1.20 లక్షల మంది వలసపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఒక్క పోలాండ్ బార్డర్ వద్దకే రెండ్రోజుల్లో 1.16 లక్షల మంది రెఫ్యూజీలు వచ్చారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఉక్రెయిన్ పై వరుసగా మూడో రోజూ రష్యా బాంబుల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల మిలిటరీ టార్గెట్లపై దాడులతోపాటు కీలక సిటీలపైనా మిసైల్స్, రాకెట్లను ప్రయోగించింది. 

దేశ రాజధాని కీవ్ సిటీ శుక్రవారం రాత్రంతా బాంబుల మోతతో దద్దరిల్లింది. సిటీలోని ఇండ్లు, అపార్ట్ మెంట్ బిల్డింగులపైనా రష్యా బాంబులు వేసింది. శుక్రవారం నాటికే కీవ్ సిటీని చుట్టుముట్టిన రష్యన్ బలగాలు శనివారం ఉదయం నుంచి చిన్న చిన్న ట్రూపులుగా సిటీలోకి ఎంటరవడం ప్రారంభించాయి. దీంతో కీవ్ వీధుల్లో రష్యన్ సోల్జర్లు, ఉక్రెయిన్ బలగాలకు మధ్య డైరెక్ట్ ఫైటింగ్ కొనసాగుతోంది.
రష్యన్ సోల్జర్లను అడ్డుకున్నం. .
రష్యన్ సోల్జర్లను తాము అడ్డుకున్నామని, రాజధాని సమీపంలో పోరాటం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. కీవ్ లోకి చిన్న చిన్న రష్యన్ ట్రూపులు రాగా, తమ బలగాలు పూర్తిగా కంట్రోల్ చేశాయని ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్యాక్ చెప్పారు. ప్రజలు షెల్టర్లలో దాక్కోవాలని, కిటికీలకు దూరంగా ఉండాలని, బుల్లెట్లు, శకలాలు తాకే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సిటీ అధికారులు సూచించారు. అయితే,  రష్యన్ బలగాలు కీవ్ లోకి ఎంత మేరకు చొచ్చుకువెళ్లాయి? అన్నది వెల్లడి కాలేదు.  
 

అపార్ట్ మెంట్ పై మిసైల్ దాడి 
కీవ్ లోని అపార్ట్ మెంట్ బిల్డింగ్ పైకి రష్యా మిసైల్ దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ దాడిలో భారీగా పేలుడు సంభవించింది. అపార్ట్ మెంట్ మధ్యభాగం ధ్వంసం అయింది. అయితే, ఇందులో ఎవరూ చనిపోలేదని హోం మంత్రి సలహాదారు ఆంటోన్ హెరాష్చెంకో ప్రకటించారు. ప్రజల ఇండ్లు, బిల్డింగులపై బాంబుదాడులు చేస్తూనే.. తాము అలాంటి దాడులు చేయడంలేదంటూ రష్యా అబద్ధాలు చెప్తోందన్నారు. రష్యన్ బలగాలు కంటిన్యూగా ప్రజల ఆస్తులపై రాకెట్, మిసైల్ దాడులు చేస్తున్నాయని, ఇప్పటికే సిటీలో ఇలాంటివి 40 దాడులు జరిగాయన్నారు.  
 

రష్యా అనుకూల సర్కార్ కోసమే? 
ఉక్రెయిన్ పై ఉత్తరం, దక్షిణం, తూర్పు నుంచి మూడు వైపులా దాడులు ప్రారంభించిన రష్యా రెండు రోజులుగా బ్రిడ్జిలు, స్కూళ్లు, అపార్ట్ మెంట్ బిల్డింగులపైనా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ లో ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సర్కారును కూల్చేసి, తమకు అనుకూలంగా ఉండే తోలుబొమ్మ సర్కారును ఏర్పాటు చేయడమే రష్యా అధ్యక్షుడు పుతిన్ లక్ష్యమని అమెరికా అధికారులు భావిస్తున్నారు.  

3,500 రష్యన్ సోల్జర్లను చంపినం: ఉక్రెయిన్ 
రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 198 మంది ఉక్రెయినియన్ లు మృతిచెందారని, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని శనివారం ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి విక్టర్ ల్యాష్కో వెల్లడించారు. 33 మంది చిన్నారులు సహా 1000 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. అయితే, మృతుల్లో సోల్జర్లు ఎంతమంది? సాధారణ పౌరులు ఎంత మంది ఉన్నారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, యుద్ధంలో మొదటి రెండు రోజుల్లోనే 3,500 మంది రష్యా సోల్జర్లను హతమార్చామని, మరో 200 మందిని బందీలుగా పట్టుకున్నామని శనివారం ఉదయం ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. రష్యాకు చెందిన 14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చివేశామని, 102 యుద్ధట్యాంకులను, 536 ఆర్మర్డ్ వెహికల్స్ ను నాశనం చేశామని వెల్లడించారు. రష్యన్ పారాట్రూపర్లను రవాణా చేస్తున్న రెండు మిలటరీ ట్రాన్స్ పోర్ట్ విమానాలను ఉక్రెయిన్ బలగాలు పేల్చివేసినట్లు శనివారం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. కీవ్ కు దక్షిణాన వసిల్కీవ్ సిటీ వద్ద ఓ విమానాన్ని, బిలా సెర్క్వా సిటీవద్ద మరో విమానాన్ని పేల్చివేసినట్లు తెలిపారు.  

821 మిలటరీ బేస్ లు ధ్వంసం చేసినం: రష్యా 
ఉక్రెయిన్ లోని దక్షిణాదిన ఉన్న మెలిటోపోల్ సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పున ఉన్న డాన్ బాస్ ఏరియాలోనూ రష్యా సపోర్ట్ ఉన్న రెబెల్స్ పూర్తి పట్టును సాధించారని తెలిపింది. శనివారం నాటివరకూ 821 ఉక్రెయినియన్ మిలటరీ ఫెసిలిటీలను ధ్వంసం చేశామని, 87 యుద్ధ ట్యాంకులు, ఇతర టార్గెట్లను నాశనం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తాము మిలటరీ టార్గెట్లపైనే దాడులు చేస్తున్నామని, కానీ సాధారణ పౌరులు కూడా చనిపోతున్నారని మాత్రం పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకూ తమకు జరిగిన నష్టంపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా  విడుదల కాలేదు.    

విదేశాల్లో ఉక్రెయినియన్ల ర్యాలీలు 
రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాలంటూ జపాన్, బ్రిటన్, తైవాన్, తదితర దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ పౌరులు శనివారం భారీగా ర్యాలీలు తీశారు. టోక్యోలోని రైల్వే స్టేషన్ ల ముందు వందలాది మంది ఉక్రెయినియన్లు గుమిగూడి నిరసనలు తెలిపారు. పుతిన్.. యుద్ధం ఆపండి, ఉక్రెయిన్ కు శాంతి కావాలి.. అంటూ నినదించారు. అయితే, జపాన్ లో రష్యన్ పౌరులు కూడా తమ దేశానికి అనుకూలంగా ర్యాలీ తీశారు. ఉక్రెయిన్ లొంగిపోవాలని నినాదాలు చేశారు.

పెట్రోల్ బాంబులు వేయండి.. 
రాజధాని కీవ్ లో రాత్రంతా ఉక్రెయిన్ బలగాలు వీరోచితంగా జరిపిన పోరాటంతో సిటీలోకి ఎంటరవ్వాలన్న రష్యా ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సలహాదారు మిఖాయిలో పొడోలియాక్ వెల్లడించారు. ‘‘సిటీ బయటా, లోపలా సాయుధ బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. ప్రజలు తమ ఇండ్లను తామే రక్షించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని రష్యన్ ఆర్మీ అధికారులు మాత్రం ఊహించి ఉండరు” అని ఆయన అన్నారు. దేశాన్ని రక్షించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని, పోరాటానికి సిద్ధమై వచ్చే ప్రతి ఒక్కరికీ వెపన్స్ అందిస్తామని జెలెన్ స్కీ చెప్పారు. ‘‘రష్యన్ బలగాలను అడ్డుకునేందుకు వీధుల్లో బారికేడ్లు పెట్టండి. రోడ్లపై టైర్లు కాల్చండి. పెట్రోల్ బాంబులు కూడా విసరండి” అంటూ ప్రజలకు రక్షణ శాఖ పిలుపునిచ్చింది.

రాత్రంతా బాంబుల వర్షం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై శుక్రవారం రాత్రంతా రష్యన్ దళాలు మిసైళ్లతో విరుచుకుపడ్డాయని, రాత్రంతా ఒక భయంకరమైన పరిస్థితి నెలకొందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ రిపోర్టర్ వెల్లడించారు. రష్యన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సిటీపై రాత్రంతా మిసైళ్ల వర్షం కురిపించాయని, కంటిన్యూగా బాంబుల మోత మోగించాయన్నారు. దేశమంతా యుద్ధం కొనసాగుతున్నా, రాజధాని కీవ్ లో యుద్ధం తారస్థాయికి చేరిందన్నారు. ఇక్కడ జరుగుతున్న దానిని వివరించేందుకు మాటలు కూడా రావడంలేదన్నారు. 

రైడ్ అక్కర్లేదు.. వెపన్స్ కావాలి: జెలెన్ స్కీ  
ఉక్రెయిన్ వీధిలో తిరుగుతూ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ మరో వీడియోను రిలీజ్ చేశారు.‘‘నేను ఇక్కడే ఉన్నా. మా పోరాటం కొనసాగుతోంది. రష్యాకు సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు” అని ఆయన వీడియోలో తేల్చిచెప్పారు.  ‘‘మేం ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదు. దేశాన్ని కాపాడుకుంటం. సత్యమే మా ఆయుధం. మా నేల, మా పిల్లలే మా సత్యం. అన్నింటినీ మేం కాపాడుకుని తీరుతం” అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ నుంచి తనను తరలించేందుకు సాయం చేస్తామన్న అమెరికా ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. ‘‘నాకు మీ రైడ్ అవసరం లేదు. యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఆయుధాలు కావాలి” అని స్పష్టం చేశారు.