అయోధ్య దీపావళి వేడుకలు: జైజై రామ్ అంటూ విదేశీ మంత్రి పాట

అయోధ్య దీపావళి వేడుకలు: జైజై రామ్ అంటూ విదేశీ మంత్రి పాట

రామ జన్మ స్థలం అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగకు ఒక రోజు ముందే శనివారం రాత్రి సరయూ నది ఒడ్డున దీపాల వెలుగులు విరిశాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని రాష్ట్ర అధికారిక వేడుకగా నిర్వహించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుండి అన్ని ఏర్పాట్లు చేయించి వైభవంగా దీపాల పండుగ చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజీ నుంచి ముఖ్య అతిథిని ఆహ్వానించారు. ఆ దేశ మంత్రి వీణా కుమార్ భట్నాగర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రామ జన్మభూమికి రావడం నా అదృష్టం

ఫిజీ మంత్రి వీణా భట్నాగర్ ప్రసంగం ఆ వేడుకలో పాల్గొన్న వారినందరినీ ఆకట్టుకుంది. ఆమె హిందీలో మాట్లాడడం ప్రారంభించగానే జనం నుంచి కేరింతలు వినిపించాయి. రాముడు పుట్టిన గడ్డకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. చిన్ననాటి నుంచి అయోధ్య గురించి వింటున్నానని ఇప్పుడు ఇక్కడికి రావడం ఆ దేవుడి ఆశీస్సుల ఫలమేనని అన్నారు వీణా భట్నాగర్. తమ పూర్వీకులు భారత్ నుంచి ఫిజీకి వలస వెళ్లారని, అయినా నేటికీ ఇక్కడి సంప్రదాయాలను ఆచరిస్తున్నామని, ఇది తనకు గర్వంగా ఉందని చెప్పారామె. ఫిజీలోని భారతీయులంతా కూడా మన సంప్రదాయ, ఆచార వ్యవహారాలను మరచిపోలేదని తెలిపారు.

రాముడిపై పాట

హిందీలో ప్రసంగించడమే ఓ అద్భుతమైతే.. పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు వీణా భట్నాగర్. జై శ్రీరామ్ అని ప్రారంభించిన ఆమె ‘మంగల్ భావన్.. అమంగళ్ హారీ’ అంటూ వీనుల విందుగా పాట పాడారు. జైజై రామ్.. జైజై రామ్ అంటూ ఆలాపించారు. మంచిని పెంచి.. చెడు భావనల్ని నాశనం చేసేవాడు శ్రీరాముడంటూ.. అయోధ్య భూమికి తన ప్రణామాలు చెబుతున్నానని ముగించారు వీణా భట్నాగర్.