
హైదరాబాద్, వెలుగు: ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవో 33పై సమగ్ర వివరాలు అందజేయాలని సూచించింది. గత ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ నియామకాలు కూడా తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ పి. శ్యాంసుందర్ రెడ్డితో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది. వాదనల తర్వాత ధర్మాసనం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు టీఎస్పీస్సీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.