సిద్దిపేట రూరల్, వెలుగు: మల్లన్నసాగర్ త్రీ ఆర్ కాలువ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి నీటితో తమ గ్రామ చెరువులను నింపాలని పుల్లూరు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట మండలంలోని పుల్లూరు గ్రామంలో సిద్దిపేట–ముస్తాబాద్ రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ ఎడమ కాలువ పుల్లూరు గ్రామం నుంచి దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ కాలువ కోసం గ్రామ రైతులు వందల ఎకరాల పంట పొలాలను వదులుకున్నారన్నారు.
కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడంతో తమ గ్రామ చెరువులోకి ఇప్పటివరకు చుక్క నీరు కూడా రాలేదని వాపోయారు. ఇరిగేషన్ అధికారులతో పాటు కలెక్టర్, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా ఇరుకోడు, చిన్నగుండెవెళ్లి, పుల్లూరు, రామంచ గ్రామాల వరకు ఆమోదం పొందిన కాలువ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
